Monday, December 23, 2024

‘సహజీవన’ దాంపత్యం

- Advertisement -
- Advertisement -

Cohabitation is also considered marital

పెళ్లి మన సమాజం పరమ పవిత్రంగా భావించే వ్యవస్థ. సాంసారిక జీవనానికి మూలంగా అది వర్ధిల్లుతున్నది. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జంట మనుగడ సాగించి సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడానికి వొక అనివార్యమైన కట్టుబాటుగా స్థిరపడిపోయింది. మొత్తం మానవ సమాజమంతటా అన్ని మతాల్లోనూ తప్పనిసరి తంతుగా వేళ్ళు తన్నుకొన్నది.పెళ్లి చేసుకున్న వారి పిల్లలనే చట్టబద్ధ సంతానంగా పరిగణిస్తారు. తండ్రి ఆస్తిలో వారికే హక్కు లభిస్తుంది. వివాహ వ్యవస్థకు బయట సహజీవనం సాగించేవారి పిల్లలకు అటువంటి గుర్తింపును గాని, తండ్రి ఆస్తిలో వాటాను గాని నిరాకరిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ కట్టుబాట్లు పరీక్షకు గురి అవుతున్నాయి. కదలిక లేని నిలువ నీటి స్థితి అంతరించి, జీవనావసరాల కోసం వలసలు పెరిగి, మనిషి సంచారాన్ని ఆశ్రయిస్తున్న వర్తమానంలో పెద్దలు, కన్నవారు కుదిర్చి చేసే పెళ్లిళ్లకు బదులు ప్రేమ వివాహాలు చోటు చేసుకొంటున్నాయి. వాటికి పెద్దల అంగీకారం లభించకపోయినా అటువంటివారికి కూడా ఉపయోగపడేలా రిజిస్టరు వివాహ విధానాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది.

దానిని సైతం ఆశ్రయించకుండా సహజీవనం సాగించి పిల్లలు కనే పద్ధతీ అక్కడక్కడా చోటు చేసుకొంటున్నది. వివాహ వ్యవస్థతో నిమిత్తం లేకుండా దానికి బయట సాగించే సహ జీవనాన్ని కూడా దాంపత్యంగానే పరిగణించి వారి పిల్లలకూ తండ్రి ఆస్తిలో వాటా పంచి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం మరొకసారి స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా- జనజీవనాన్ని వీలైనంతగా చిక్కులకు, చికాకులకు అతీతం చేసి, సంప్రదాయాల అడ్డంకుల నుంచి విముక్తం చేయడానికి న్యాయస్థానాలు, ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పూనుకోడం సంతోషదాయకం. కేరళకు చెందిన వొక కుటుంబ ఆస్తి పంపక వివాదంలో సుప్రీంకోర్టు యీ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో వొక వ్యక్తి నలుగురు కుమారుల్లో అచ్యుతన్ మినహా ముగ్గురూ బ్రహ్మచారులుగానే చనిపోయినందున అతడి కుమారుడే ఆస్తికి ఏకైక వారసుడనే వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చనిపోయిన వారిలో ఒకడైన దామోదరన్ చిరుతకుట్టి అనే స్త్రీతో జీవితాంతం సహజీవనం సాగించాడని వారిది కూడా వివాహంగా భావించి వారికి పుట్టిన కుమారుడికి సైతం ఆస్తిలో వాటా పంచి ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేయవచ్చునని చెబుతూనే సహజీవనం వల్ల పుట్టిన వ్యక్తి వారి సంతానం కాదని పిటిషన్ దారే నిరూపించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.

ఆ జంట దీర్ఘకాలం కలిసి కాపురం చేసినట్టు నిరూపించే సాక్ష్యాలను ఆధారం చేసుకొని ఈ తీర్పు వెలువడింది. శిక్షాస్మృతి 123 సెక్షన్ ప్రకారం పురుషుడితో సహజీవనం చేస్తున్న స్త్రీకి, ఒక భార్యకు ఉండే హక్కులుండాలని 2008లో జాతీయ మహిళ కమిషన్ సిఫారసు చేసింది. సహజీవనం వల్ల కలిగే సంతానాన్ని అక్రమ సంతానంగా పరిగణించరాదని, సహజీవనం ఛాందస సమాజం దృష్టిలో అనైతికం కాని, న్యాయస్థానం దృష్టిలో కాదని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసింది. కెనడా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో సహజీవనాన్ని న్యాయమైనదిగా గుర్తిస్తారని పేర్కొన్నది. స్త్రీ, పురుష సమాగమం వల్లనే సంతానం కలిగి సమాజం వర్ధిల్లుతుంది. ఇందుకు పెళ్లి అనే ప్రక్రియ అవసరం లేదు. కాని సహజీవనం సాగించే స్త్రీని పురుషుడు మోసగించే అవకాశం లేకుండా పెళ్లి చాలా వరకు కాపాడుతుంది. న్యాయస్థానాల్లో సైతం అది నిలుస్తుంది. పెళ్ళికి బయట సాగించే సహజీవనాన్ని సమాజం గుర్తించనందున అటువంటి సంబంధం కలిగిన స్త్రీ ని, ఆమె పిల్లలను అది అవమాన దృష్టితో చూస్తుంది. ఆ మహిళ, ఆమె పిల్లలు దిక్కు మొక్కు లేని వారవుతారు అందుచేత సుప్రీం కోర్టు ఇటువంటి కేసుల్లో తరచూ కలిగించుకొని సహజీవనాన్ని సమర్ధిస్తున్నది.అయితే చాలా కాలంగా తలిదండ్రులను కాదని ప్రేమించుకునే జంటలు ఆశ్రయించి చేసుకుంటున్న ఆర్య సమాజ వివాహాల గుర్తింపును సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేయడమే విడ్డూరం.

వారి హక్కులకు రక్షా కవచంగా నిలుస్తున్నది. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు సహజీవన దాంపత్యాలను నాలుగు విధాలుగా పేర్కొన్నది. అవి 1) అవివాహిత స్త్రీ పురుషుల మధ్య ఇష్టపూర్వకంగా సాగేవి 2) వివాహిత పురుషుడు అవివాహిత స్త్రీ మధ్య ఆ విషయం తెలిసీ సాగేవి 3) వివాహిత స్త్రీ, అవివాహిత పురుషుడు మధ్య జరిగేవి 4) ఏకలింగ భాగస్వాముల మధ్య సాగేవి. కలిసి జీవించడం అనేది మానవ హక్కు, కేవలం వివాహిత దంపతులే కలకాలం సంకెళ్లు బిగించుకొని జీవించాలనే నియమమేమీ లేదు. పాతివ్రత్యం, సతీవ్రత్యం అనేవి కూడా వొక క్రమశిక్షణ కోసం ఏర్పడినవే కాని అనుల్లంఘనీయమైనవి కావన్నది ప్రజాస్వామిక ధర్మమని సుప్రీంకోర్టు యింత స్పష్టంగా చెబుతుంటే సమాజం ఇంకా పరువు హత్యల, పురుష దురహంకార దుర్మార్గాల మురికిలో రోగగ్రస్థమై వుండడమే బాధాకరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News