తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
చెన్నై: కోయంబత్తూరులో ఇటీవల సంభవించిన పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలని కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. విద్రోహ కుట్రలను భగ్నం చేసేందుకు, తన నిఘా విభాగాన్ని పటిష్టం చేసేందుకు ఒక ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కోయంబత్తూరు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు తాజా పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు ఒక ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కోయంబత్తూరులో ఈనెల 23న ఒక గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒక వ్యక్తి మరణించిన దరిమిలా మృతుని ఇంట్లో జరిపిన సోదాల్లో 75 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.