Wednesday, December 25, 2024

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని అధికారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూరు: తమిళనాడుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డిఐజి ర్యాంక్‌కు చెందిన ఆయన శుక్రవారం ఉదయం తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం సి విజయ్ కుమార్ కోయంబత్తూరు సరిల్‌లో డిఐజి హోదాలో పని చేస్తున్నారు. ఆ నగరానికి చెందిన రెడ్‌ఫీల్డ్‌లోని క్వార్టర్స్‌లో కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల సమయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌కుమార్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని,ఆ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి ఎ అరుణ్ చెప్పారు.

విజయ్‌కుమార్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్‌తో తాను మాట్లాడానని, నాలుగు రోజుల క్రితం ఆయన మానసిక ఒత్తిడికి సంబంధించి తనను కన్సల్ట్ చేశారని, తాను కొన్ని మందులు ఇచ్చానని ఆ డాక్టర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజికి తరలించారు. ఈ ఏడాది జనవరినుంచి విజయ్‌కుమార్ డిజిపి హోదాలో పని చేస్తున్నారు. 2009 ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన అంతకు ముందు కాంచీపురం, నాగపట్టణం, కడలూరు,తిరుపూర్ జిల్లాల్లో ఎస్‌పిగా పని చేశారు. కోయంబత్తూరు సర్కిల్‌కు రాకముందు చెన్నైలో డిసిపిగా పని చేశారు. విజయ్‌కుమార్ సొంత జిల్లా అయిన థేనిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. థేనిలో ఆయన భౌతిక కాయానికి తమిళనాడు డిజిపి శంకర్ జివాల్ నివాళులర్పించారు.
స్టాలిన్ సంతాపం
విజయ్‌కుమార్ మృతిపై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందించారు.‘ డిఐజి విజయ్‌కుమార్ మృతి మాకు తీరని లోటు.గతంలో ఆయన ఎస్‌పిగా ఉంటూనే ఇతర బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడుకు గౌరవం తీసుకొచ్చారు’ అంటూ తీవ్ర సంతాపం తెలియజేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ప్రతిపక్ష నాయకుడు కె పళనిస్వామి తదితరులు కూడా విజయ్ కుమార్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News