కోయంబత్తూరు : నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడు లోని కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. దీంతోపాటు రూ. 3.32 కోట్ల జరిమానా విధించింది. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లోని బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబరు 9 న ఫిర్యాదు నమోదైంది. సంస్థకు చెందిన 47 బస్సులను నకిలీ పత్రాలతో విక్రయించి రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.
చేరన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి , డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైస్వామి, రంగనాథన్, రాజేంద్రన్లను పోలీస్లు అరెస్టు చేశారు. అప్పటినుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోపే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు. కోర్టు తీర్పు శుక్రవారం వెలువడింది. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి శివకుమార్ నిర్దోషులుగా పేర్కొన్నారు.
సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షల మొత్తం కలిపితే 383 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం నిందితుడి వయసు 82 సంవత్సరాలు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని న్యాయస్థానం తీర్పు నిచ్చింది.