భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు చల్లారిన టీ ఇచ్చినందుకు సంబంధిత ప్రభుత్వాధికారికి షోకాజ్ నోటీస్ అందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఛతర్‌పూర్ జిల్లా ఖజురహో పర్యటనలో భాగంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు నాణ్యత లేని చల్లని టీ అందించినందుకు జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కనౌహాకు రాజ్‌నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ డీపీ ద్వివేది షోకాజ్ నోటీస్ అందించారు. మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకుంటే ఏకపక్షంగా చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. ఈ షోకాజ్ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నోటీసును ఛతర్‌పూర్ కలెక్టర్ రద్దు చేవారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్, రేవాకు వెళ్తుండగా, సోమవారం ఖజురహో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. విమానాశ్రయంలో విఐపి లాంజ్‌లో ఉన్న సమయంలో ఆయనకు, అతిధులకు సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో టీ అందించారు. అయితే అది నాణ్యత లేకుండా చల్లగా ఉంది. సీఎం రిఫ్రెష్‌మెంట్ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన కనౌహా ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని ఆ నోటీసులో ఉంది. ఇది వైరల్ కావడంతో రద్దు చేశారు.