Saturday, November 23, 2024

చలి తీవ్రతకు జనం గజ గజ

- Advertisement -
- Advertisement -

Cold intensity Rising across Telangana

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. వామ్మో.. ఇదేం చలి..!! అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హడలిపోతున్నారు. తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వైపునకు వేగంగా పడిపోతుండగా, హైదరాబాద్ నగరం సైతం తక్కువ కాదన్నట్లు కనిష్ట ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత ఈ దశాబ్దం (10 ఏళ్ల)లోనే అత్యల్పం అని వాతావరణ విభాగం తెలిపింది. అంతేకాదు రానున్న రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు ఇంకాస్త దిగజారుతాయని, ఆ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈసారి 8.2 డిగ్రీలకు పడిపోవడం ద్వారా దశాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లయింది. హైదరాబాద్ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత మూడు నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకూ ఉంటాయని, డిసెంబర్ 21 వరకు నగరంలో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పిల్లలు, పెద్ద వయసు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News