రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆ వివరాలను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల కారణంగా గత వారం రోజులు రాష్ట్రంలో మేఘాలు కమ్ముకున్నాయని. ప్రస్తుతం మేఘాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పగలు కాస్త ఎండగా ఉన్నప్పటికీ రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 29 ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని పేర్కొంది.
ఈ నెల 30న కనిష్టంగా 17 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీలు, 31న 17 నుంచి 29 డిగ్రీల వరకు, జనవరి 1న 15 డిగ్రీలకు తగ్గి 30 డిగ్రీల వరకు, జనవరి 2న 15 నుంచి 30 డిగ్రీలు, జనవరి 3న 15 నుంచి 29 డిగ్రీలు, జనవరి 4న 15 నుంచి 30 డిగ్రీల వరకు నమోదు అవుతుందని వాతావరణ శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఉష్ణోగ్రత పగటి వేళ సరాసరిన తెలంగాణలో 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని తెలిపింది. రాత్రి వేళ తెలంగాణలో 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణం స్పష్టం చేసింది. ఆదివారం నాడు హైదరాబాద్‌లో 29 డిగ్రీలు, రామగుండంలో 29.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 28.2 డిగ్రీలు, నిజామాబాద్‌లో 28.6 డిగ్రీలు, ఖమ్మంలో 30.4 డిగ్రీలు, హన్మకొండ 31 డిగ్రీలు, మెదక్ 28.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
బలమైన శీతల గాలులు
బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 31 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో చలి గాలి వీస్తుందని వాతావరణ పేర్కొంది. శ్రీలంక తూర్పు వైపున ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా గాలులన్నీ అటువైపు వెళ్తున్నాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితిలో వాతావరణంలో తేమ శాతం కూడా పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం గాలిలో తేమ 40 నుంచి 50 శాతంగా ఉంటుందని పేర్కొంది. చలి కాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని వెల్లడించింది. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వీస్తాయని పేర్కొంది. దీంతో వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశంతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 31 కిలోమీటర్లుగా ఉండగా, ఏపీలో గంటకు 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని పేర్కొంది.
చలి నుంచి జాగ్రత్తలు తప్పనిసరి
రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో చలిగాలుల తీవ్రత, మంచు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు పిల్లలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయని, వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని, మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ వంటివి దారి తీస్తాయని చెబుతున్నారు. ఇటువంటి రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుందని, దీనివల్ల శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు తీవ్రమవుతుందని చెబుతున్నారు.