Sunday, December 22, 2024

కమలంలో కోల్డ్ వార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియలో బిజెపి నేతల రాజకీయం వీధికెక్కుతోంది. పార్టీలో అంతర్గతంగా కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకరి ప్రయత్నాలకు ఒకరు గండికొడుతున్నారు. బిజెపి అధ్యక్ష పదవికి పోటీ పడే వారు ఢిల్లీలో ఎవరికి వారు తమ లాబీయింగ్ ముమ్మరం చేస్తున్నారు. ఒకరి కొకరు పోటీపడుతూ ఎదుటి వారి ప్రయత్నాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్లమెంటు సమావేశాల తర్వాతే రాష్ట్ర బిజెపి చీఫ్ పదవికి సరైన అభ్యర్థి ఎంపిక కొలిక్కి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు సమావేశాల అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించిన తర్వాతే రాష్ట్ర బిజెపి అధ్యక్షుల మార్పు జరుగుతుందని పార్టీ సంకేతాలు పంపుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్న బిజెపి పెద్దలను సమన్వయం చేసుకుని ఢిల్లీలో చక్రం తిప్పేందుకు మరికొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలో ఉన్న సీనియార్టీ, ఇతర పార్టీల నుంచి వచ్చి ఉంటే ఆ వివరాలు అన్నింటిని బేరీజు వేసుకుని రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి నుంచి పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెరుగుతోంది.

కాగా తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలిసినా ఆ వ్యాఖ్యలను ఎవరు సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. ఈ నేపధ్యంలో బిజెపిలో నాయకుల మధ్య విబేధాలు బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కీలక నేతలు పోటీ పడుతుండగా ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమించగా, మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్రం నుంచి కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి విపరీతంగా పోటీ పెరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష రేస్‌లో మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈటల ప్రయత్నాలకు కొందరు అడ్డుతగులుతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈటల కన్నా ముందు నుంచీ పార్టీలో ఉన్న వారిని కాదని ఈటలకు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఈటల కౌంటర్ ఇవ్వడంతో బిజెపి అంతర్గత వార్ బయటపడింది. “తెలంగాణలో బీజేపీని నడిపించేందుకు నాయకుడు మాత్రమే కాదు, ఫైటర్ కావాలంటూ” రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేవాళ్లు, అందరినీ కలుపుకుని పోయే వాళ్లయితేనే రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి మంచిదని రాజాసింగ్ పార్టీ హైకమాండ్‌కు తన ట్వీట్ ద్వారా సూచించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. గల్లీ ఫైటర్ కాదు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలని అంతే వేగంగా ఈటల సమాధానం చెప్పారు. సందర్భం వస్తే జేజమ్మతో అయినా కొట్లాడేటోల్లమంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని ఈటల రాజేందర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణ బిజెపి పగ్గాలు ఎవరికి చిక్కుతాయనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపి స్థానాలు బిజెపి గెలుచుకుంది. అంతకుముందు జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా 8 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి జెండా ఎగురవేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ గత ఎన్నికల్లో ఎక్కువగా పెరగడం, ఓటింగ్ శాతం కూడా 36 శాతానికి బిజెపి చేరుకోవడంతో పార్టీ రానున్న ఎన్నికలపై దృష్టిసారించింది. ఇందుకు అనువైన రాష్ట్ర కమల దళపతి కోసం కసరత్తు ముమ్మరం చేసింది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్న ఎంపిలంతా ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటులో ఎంపిలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలు దేరి వెళ్లారు. బీజేపీలో నిబంధనల ప్రకారం ఒక నేతకు ఒకటే పదవి సూత్రాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఈ ప్రకారం కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలను వేరేకరికి అప్పగించే పనిపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.

అయితే.. ఈటల రాజేందర్‌కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, రాజకీయ అనుభవం ఇలా చాలా ఫ్యాక్టర్లే ఆయనకు మొగ్గు చూపుతుండగా పార్టీలోని కొందరు నేతలు మాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ బిజెపి రాజకీయాల్లో రాజాసింగ్, ఈటల వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాను అవసరమైతే రేవంత్‌రెడ్డితో కూడా కొట్లాడుతానని, హామీలు అమలు చేయకపోతే తనదైన పద్దతిలో పోరాడుతానని ఈటల రాజేందర్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైనప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజాసింగ్‌కు కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఎంపీలు డీకే అరుణ, అరవింద్, రఘునందన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, మురళీధర్ రావు, మరికొందరి పేర్లు సైతం చర్చకు వస్తున్నాయి. బిజెపి అగ్రనాయకత్వం ఎవరివైపు నిలుస్తుందో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News