పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
ఉత్తర తెలంగాణలో చలిగాలులు అధికం
అప్రమత్తంగా ఉండాలని -వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈశాన్య దిశనుంచి వీస్తున్న శీతల గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే చలిగాలులు వణికిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భోథ్‌లో 12.6, బేలాలో 12.7, గడిగూడలో 12.8, కేరమేరిలో 12.9, తలమడుగు, పొచరలలో 13, సిర్పూర్‌లో 13.1, థాంసీ, రామ్‌నగర్‌లలో 13.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. 24గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయని, ఈశాన్య భారతం నుంచి తేమగాలులు అధికంగా వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గాలులు దిశను మార్చుకోవడంతో చలి తీవ్రత
తూర్పు, ఆగ్నేయం వైపు నుంచి వీస్తున్న గాలులు దిశను మార్చుకోవడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల 48 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వారు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి చలిగాలులు ఎక్కువగా వీస్తాయన్నారు. రెండురోజుల తర్వాత ఉత్తరాది నుంచి చలిగాలులు వీచే అవకాశం ఉందని, దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. ఉత్తర శ్రీలంక తీరం దగ్గర అల్పపీడనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం వైపు వెళ్లి బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కిందిస్థాయి గాలులు ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
శ్రీలంక తీరం వద్ద కొనసాగుతున్న అల్పపీడనం..
ఉత్తర శ్రీలంక తీరం దగ్గర అల్పపీడనం కొనసాగుతు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.