ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతీ త్రివేణి సంగమం వద్ద కోలీఫామ్ బ్యాక్టీరియా అత్యధిక స్థాయిలో వ్యాపించడంతో ఈ నీళ్లు స్నానానికి కానీ, ఆచమనానికి కానీ పనికి రావని నివేదిక వెలువడడం ఇప్పుడు వివిధ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నివేదికను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు సమర్పించింది. నీటి నాణ్యతపై ఈ నివేదిక విశ్లేషిస్తూ ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 2500 వరకు కోలీఫామ్ బ్యాక్టీరియాలు ఉన్నా ఆ నీరు స్నానానికి యోగ్యమేనని, అంతకు మించి బ్యాక్టీరియా స్థాయిలుంటే వ్యాధులు వస్తాయని నివేదిక పేర్కొంది. గంగానదిలో ఎక్కడ ఏ పాయింట్లలో కోలీఫామ్ బ్యాక్టీరియాలు అధిక స్థాయిలో ఉన్నాయో వివరించింది.
మొత్తం మీద గంగానదీ జలాల్లో కొన్ని చోట్ల 100 మిల్లీలీటర్ల నీటిలో 7900 నుంచి 11000 వరకు కోలీఫామ్ బ్యాక్టీరియాలు ఉన్నట్టు పరిశోధనలో బయల్పడడం ఆందోళన కలిగించే విషయం. ఈ శాస్త్రీయ పరిశోధన నివేదిక ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్షణ నివారణ చర్యలు తీసుకోడానికి బదులు, ఈ నివేదికనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అపహాస్యం చేయడం విడ్డూరం. యుపీ కాలుష్య నియంత్రణ మండలి, సిపిసిబి అక్కడి జలాల స్వచ్ఛతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన సమర్థించుకున్నారు. లీటరు నీటిలో మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఒడి) ఉంటే అది స్నానానికి యోగ్యమని ప్రమాణాలు చెబుతున్నాయి. సంగమ స్థలంలో అది 3.94 నుంచి 5.29 వరకు వేర్వేరు స్థాయిలో బిఒడి ఉన్నట్టు సిపిసిబి వెల్లడించింది.
జనవరి 12, 13 తేదీల్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఒడి) ఎక్కువగా ఉన్నప్పటికీ, తర్వాత మంచి నీటిని పైనుంచి విడుదల చేయడం వల్ల తగ్గిందని సిపిసిబి పేర్కొంది. అయితే ఫిబ్రవరి 4న నమోదు చేసినప్పుడు కోలీఫామ్ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని వెలువడిన నివేదిక సంగతి ఏమైనట్టు? భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు శాస్త్రీయ పరిశోధన కన్నా సనాతన ధర్మానికే యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యం ఇవ్వడం అజ్ఞానాంధకారమే తప్ప ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి భద్రత కల్పించబోదు. మనుషుల, జంతువుల మలం నుంచి పుట్టుకొచ్చే బ్యాక్టీరియా, వైరస్, తదితర హానికరమైన క్రిములు వల్ల కలరా, టైఫాయిడ్ వంటి భయంకర వ్యాధులు వ్యాపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థే హెచ్చరిస్తున్నప్పుడు, దానిని విస్మరించి సంగంవద్ద నీళ్లు స్నానానికి, ఆచమనం చేయడానికి అనుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అడ్డగోలుగా వాదిస్తున్నారు.
పైగా సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఇప్పటివరకు కుంభమేళాలో స్నానమాచరించిన 56 కోట్ల మంది భక్తుల విశ్వాసంతో ఆడుకున్నట్టే అని శాపనార్ధాలు పెట్టడం ఫక్తు ఛాందసవాదమే.ఈ ఛాందసవాదం ముందు శాస్త్రీయ పరిశోధన పరిహాస్యాస్పదమవుతోంది. 2020 నాటికి గంగానదిని శుద్ధి చేస్తామని గత ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికినా కనీసం నాలుగోవంతు కూడా ప్రక్షాళన కాలేదన్నది వాస్తవం. 2012 వరకు గంగానది ప్రక్షాళన పేరుతో రూ. 11,000 కోట్లు ఖర్చయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గంగ, యమున, తదితర నదుల శుద్ధికి రూ. 17 వేల కోట్లు ఖర్చయినా, అనుకున్న లక్షం నెరవేరలేదని ప్రభుత్వమే 2020 కి ముందు పార్లమెంట్‌లో అంగీకరించడం గమనించదగ్గ విషయం.
గంగానదిలో ప్రమాదకరమైన న్యూఢిల్లీ మెటల్లో చీటా లాక్టమేడ్ (ఎన్‌డిఎం1) అనే బ్యాక్టీరియా జన్యువు పొంచి ఉన్నట్టు గతంలోనే పరిశోధనలో వెల్లడైంది. తక్కువ కాలంలోనే గర్భాశయంలోకి ప్రవేశించే ఈ బ్యాక్టీరియా వల్ల 2009లో చాలా మంది శిశువులు ఆస్పత్రిలో మృతి చెందారని ఉత్తరప్రదేశ్‌లోని బిజునోర్‌కు చెందిన పిల్లల డాక్టర్ విపిన్ వశిష్ట ప్రస్తావించడం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోకతప్పదు. ఈ బ్యాక్టీరియా ఔషధాలను ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియా అని భారత్, బ్రిటన్ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఇంతకీ ఈ బ్యాక్టీరియాకు పుట్టిల్లు యమునా నది కావడం విశేషం. ఇది మలంలోని కోలీఫారమ్ బ్యాక్టీరియాతో కూడా కలుస్తుందని పరిశోధనలు వెలువడ్డాయి. హరిద్వార్ వద్ద ఎగువ గంగా నదీలో కూడా బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని ఆ నీటి నమూనాలు రుజువు చేస్తున్నాయి.
దేశంలో ఎన్ని నదులు కలుషితమవుతున్నాయి అని ప్రశ్నించుకుంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) 603 నదులను సమీక్షించగా, ఆర్గానిక్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఒడి) ఆధారంగా 279 నదుల మీద 311 కాలుష్య స్థాయిలు కనిపిస్తున్నాయని వెల్లడైంది. ఒకే నదిలో కొన్ని చోట్ల శుద్ధి జరిగినా, మరికొన్ని చోట్ల జరగడం లేదు. అలాంటప్పుడు కుంభమేళాలో కొన్ని కోట్ల మంది స్నానాలు చేసేటప్పుడు వెలువడే మలిన పదార్ధాలను ప్రక్షాళన చేయడానికి తగిన ప్లాంట్లు ఉన్నాయా? దీనిపై పారదర్శకంగా తరచుగా దర్యాప్తు చేయడం సాధ్యమవుతుందా? మహారాష్ట్రలోని పుణె, పరిసర ప్రాంతాల్లో ఇటీవల గులియన్ బారీ సిండ్రోమ్ అనే వ్యాధి కలకలం రేపుతోంది.
నీటిలోని ఈ కోలీ బ్యాక్టీరియాయే దీనికి కారణమని తేలింది. ఈ నేపథ్యంలో మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి వస్తున్న కొన్ని కోట్ల మంది వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నివారించడం యుపి ప్రభుత్వానికి ఒక సవాలే? ఎలాంటి ప్రక్షాళన కాని వ్యర్థ జలాలు పరిశ్రమలనుంచి, సాగుభూములనుంచి వెలువడి నదుల్లో కలుస్తుండటం ఇప్పటికీ జరుగుతోంది. మున్సిపాలిటీల ఘనవ్యర్థాలు 25% వరకు శుద్ధికావడం లేదని నివేదికలు చెబుతున్నాయి.