భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి
అభినందిస్తూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం కలెక్టర్ భార్య మంగళవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.ముక్కంటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సిజేరియన్ చేశారు. కొంతకాలంగా మాధవి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి గైనకాలజిస్టుల సలహా లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ ప్ర యత్నంపై పలువురు అభినందనలు తెలిపారు.
ట్విట్టర్‌లో మంత్రి హరీష్‌రావు అభినందనలు
సర్కారు దవాఖానలో కలెక్టర్ భార్య ప్రసవం చేయించుకోవడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు వైద్యం కోసం మొదటి ఎంపికగా ప్రభుత్వాసుపత్రులను ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.