మృదు మధురమైన లలిత గీతాలు, శ్రావ్యమైన పద్య వచన కావ్యాలుతో పాటు, సరళ సుందర ఆంగ్లాను వాదాలు చేయడంలో అందవేసిన చేయి ఆయనది, ఉద్యోగరీత్యా ప్రతిష్ఠాత్మకమైన కలెక్టర్‌గా పనిలో తలమునకలై ఉండి కూడా, తనకు చిన్ననాటి నుండి ఇష్టమైన సాహిత్యంలో సాన్నిహిత్యం చేస్తూ… అనేక రచనలు చేసి ‘కలెక్టర్ కవి’ గా తెలుగు సాహిత్యానికి సమున్నత గౌరవం అందించిన అచ్చ తెలుగు తెలంగాణ ముద్దుబిడ్డ జె. బాపురెడ్డి. పూర్వ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సమీపంలోని సిరికొండ గ్రామంలో 21 జూలై 1936న జంకె కృష్ణారెడ్డి రామలక్ష్మి దంపతులకు జన్మించిన బాపురెడ్డి, సిరిసిల్ల హైదరాబాదుల్లో విద్యాభ్యాసం చేసి అత్యున్నతమైన కలెక్టర్ ఉద్యోగం పొంది మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు, అనంతరం వివిధ ప్రభుత్వ రంగ శాఖల్లో అత్యున్నత పదవుల్లో తన అమూల్యమైన సేవలు అందించారు.
తన జిల్లా ప్రాంతపు కవి అయిన సి నారాయణరెడ్డి స్ఫూర్తితో ఎనిమిదవ తరగతిలోనే సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకొని నిరంతర సాధన అధ్యయనంతో తెలుగు సాహితీ క్షేత్రంలో సర్వోత్తమ కవిగా రాణించటమే గాక జాతీయ స్థాయిలో తెలుగు కవిత్వం ఖ్యాతి చాటారు, పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం, బాలసాహిత్యం తదితర అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన రచన ప్రతిభ చూపారు. 1960 సం. లో రాసిన ‘చైతన్య రేఖలు’ తొలి కవితా సంపుటి మొదలు వందలాది రచనలు చేశారు అవి సుమారు 38 పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి, ఆయన రాసింది ప్రౌఢ సాహిత్యమే అయినా, ఆయన మనసు అందమైన బాల్యపు సొగబులు నింపుకునేది, నిండైన దేశభక్తి, సమైక్యత రావాలు, సహృదయ భావనలు, బాపురెడ్డి కవిత్వం నిండా కనిపిస్తాయి. చితికి పోతున్న జీవితంలో బతికిపోయిన బాల్యం కోసం వెతుకుతున్నాను అంటారు ఆయన, రాకెట్టు రాయబారం, హృదయ పద్యం, శ్రీకార శిఖరం, నా దేశం నవ్వుతుంది, మనసులో మాట, మన సౌదామిని, ఆత్మీయ రాగాలు, పద్యాల పల్లకి, మొదలైన రచనలు బాపురెడ్డి విలక్షణ సాహితీ విరిదండలోని మచ్చుకు కొన్ని మాత్రమే.! వీరి గేయాలు పాఠ్యపుస్తకాలలో స్థానం పొందిన ప్రామాణిక మణి చందనాలు, మరికొన్ని ఆకాశవాణి శ్రోతలకు లలిత గీతాలుగా శ్రవణానందం పంచిన మధుర తేనియలు, అందుకే ఆయనలోని సాహితీ సృజనను కీర్తిస్తూ… ‘బాపురే బాపురెడ్డి బంగారు భావాల కడ్డి’ అని సమకాలీనులు అభినందించారు.
కవిగా ఆయన రాసిన ‘ఎకనామిక్స్ సుందరి’ ఆయనకు విశేషమైన పేరు తెచ్చింది, ఒకవైపు దక్షత గల కలెక్టర్ గా కార్యదీక్ష, మరోవైపు మనసులోని భావాలకు మధురమైన కవనం పులిమిన సాహితీ సేద్యం, అదికాక ఉద్యోగ విధుల్లో భాగంగా చేసిన విదేశీ పర్యటనల తాలూకు అనుభవాల జ్ఞాపకాలను యాత్ర కథనాలు రూపంలో రాసిన యాత్రా రచయిత తాను.. కేవలం సృజనతోనే సరిపెట్టుకోకుండా నాటి ఆంధ్రప్రదేశ్ సంగీత, సాహిత్య, అకాడమీలలో సభ్యుడుగాను, మొదటి ప్రపంచ తెలుగు మహాసభల కార్యదర్శిగాను, నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల హైపర్ కమిటీ సభ్యుడుగాను, అనేక సాంస్కృతిక సంస్థలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సహాయ సహకారాలు అందించిన ఆత్మీయ సాహితీ సేనాని తను.
బాపురెడ్డి బహుముఖ కృషికి గాను 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ‘మన చేతుల్లోనే ఉంది’ పుస్తకానికి గాను 1989లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ గ్రంథ పురస్కారం లభించాయి. విశ్వవిద్యాలయ స్థాయి గౌరవ డాక్టరేట్ కూడా పొందిన బాపురెడ్డి ఆవిశ్రాంత కృషికి గాను 2016 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరధి సాహితీ పురస్కారం ప్రదానం చేసింది. ఇంతటి సాహితీమూర్తి 08 ఫిబ్రవరి 2023న కాల ధర్మం చెందినట్టు కుటుంబ సభ్యులు ఇచ్చుకున్న ‘శ్రద్ధాంజలి ప్రకటన’ ద్వారానే ఆయన మరణ వార్త తెలంగాణ ప్రజలు తెలుసుకోగలిగారు, కారణాలు ఏమైనా తెలుగు సాహితీవేత్తల మరణ వార్తలకు ఆవహిస్తున్న నిర్లక్ష్యపు నీడలకు భవిష్యత్తులో అయినా చరమగీతం పాడాలి, సాహితీ వేత్తలకృషిని మరవడం అంటే మనల్ని మనం మర్చిపోవడమే అని అందరం గుర్తుంచుకోవాలి.
డా: అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223