Friday, December 20, 2024

గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -
  • నిబంధనల అమలుపై నిశిత పరిశీలన
  • 59.15 శాతం మంది అభ్యర్థులు హాజరు

రంగారెడ్డి: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ఆదివారం జరిగిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతోపాటు కలెక్టర్ హరీష్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. అబ్దూల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో, పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో, వనస్థలిపురం ఎస్ కెడి నగర్‌లోని దిల్‌సుఖ్ నగర్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ హరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది సిసి కెమెరా ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.

కాగా, ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా జరిపిన వేలిముద్రల సేకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 59.15 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 131 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 55032 మంది అభ్యర్థులకు గాను 32553 మంది పరీక్ష రాయగా, 22479 మంది గైర్హాజరయ్యారని వివరించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లైజనింగ్ అధికారులు ఉన్నారు.

అరగంట ముందు పేపర్ తీసుకున్నారన్న ప్రచారం అవాస్తవం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని చైతన్య కాలేజీలో జరిగిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రంలో అరగంట ముందుగానే అభ్యర్థుల నుండి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కలెక్టర్ హరీష్ ఖండించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయాలను పాటిస్తూ ప్రశ్న పత్రాలు ఇవ్వడం, పరీక్ష ముగిసిన మీదట ఓఎంఆర్ షీట్లను తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్ పరీక్ష సమయం ముగియడానికి మరో అరగంట వ్యవధి మిగిలి వుందని అభ్యర్థులకు తెలుపుతూ అప్రమత్తం చేశారే తప్ప, ముందుగానే ఓఎంఆర్ షీట్లను వారి నుండి తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు. అయితే ఇన్విజిలేటర్ చేసిన ముందస్తు హెచ్చరిక వల్ల తాము ఒకింత ఆందోళనకు గురయ్యామని పది మంది వరకు విద్యార్థులు తమకు ఫిర్యాదు చేశారని, అంతే తప్ప సమయం పూర్తికాక ముందే ఓఎంఆర్ షీట్లను తీసుకున్నారనడంలో వాస్తవం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, ప్రచార సాధనాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ అభ్యర్థులను, ప్రజలను గందరగోళానికి గురిచేయడం తగదని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News