గద్వాల ః తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా శనివారం జరిగిన గ్రూప్ 4 మొదటి సెషన్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని నవోదయ, ఙ్ఞాన ప్రభ కళాశాల, ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అభ్యర్థుల హాజరు శాతం గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నా పత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.
మధ్యాహ్నం రెండవ సెషన్‌లో జరిగే పేపర్ 2 పరీక్షను ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్భందీగా నిర్వహించాలని, టిఎస్‌పిఎస్‌సి నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లకు కలెక్టర్ సూచించారు. గ్రూప్4 పేపర్ 1 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి సెషన్‌ల్‌లో 14 వేల 920 మంది అభ్యర్థులలో 12 వేల 580 మంది హాజరు కాగా 2 వేల 340 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.