బెంగళూరు: హిజాబ్ ధరించడం మతపరమైన తప్పనిసరి సంప్రదాయం కాదని, విద్యాసంస్థల్లో మతపరమైన వస్త్రధారణను రాష్ట్రప్రభుత్వం నిషేధించడాన్ని కర్నాటక హైకోర్టు సమర్థిస్తూ మంగళవారం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో బుర్ఖా ధరించి పరీక్ష రాయడానికి వచ్చిన 8మంది ముస్లిం విద్యార్థినులను కాలేజి అధికారులు వెనక్కి పంపించేశారు. యాద్గిర్ జిల్లాలోని కెంభవి పియు కాలేజిలో రెండో సంవత్సరం పియు ప్రిపరేటరీ పరీక్షలు రాయడానికి బుర్ఖాలు ధరించి వచ్చిన 8 మంది విద్యార్థినులను వెనక్కి పంపించేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు ఈ కాలేజిలో విద్యార్థినులు తరగతి గదుల్లో కూడా హిజాబ్‌లు దరించడానికి అనుమతించే వారు.
అయితే తరగతి గదుల్లోకి హిజాబ్‌లను అనుమతించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను పాటించాలని కాలేజి అధికారులు విద్యార్థినులకు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది విద్యార్థినులు సోమవారం హిజాబ్‌లు లేకుండానే పరీక్ష రాశారు. అయితే ఈ రోజు మాత్రం వారు హిజాబ్‌లను తీసేయడానికి నిరాకరించారు. అధికారులు ఎంతగా నచ్చజెప్పినా వినకపోవడంతో తిరిగి వెళ్లిపోవలసిందిగా అధికారులు ఆదేశించారు.హైకోర్టు ఉత్తర్వుల మేరకు హిజాబ్‌లు ధరించవద్దని తాము విద్యార్థులకు నచ్చ జెప్పడానికి చాలా ప్రయత్నించాం. దానికి వారు కూడా కట్టుబడి ఉన్నారు. అయితే ఈ రోజు వారు నిరాకరించారని యాద్గిర్ జిల్లా ప్రీయూనివర్సిటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ చంద్రకాంత్ జె హళ్లి చెప్పారు.