తోటి విద్యార్థినుల దాడి.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ
తక్కువ మార్కులు వచ్చాయంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతాయింపు
మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు
విద్యార్థి సంఘం నాయకులు మృతదేహంతో జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయింపు
పోలీసుల హామీతో ఆందోళన విరమణ
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తోటి విద్యార్థుల ర్యాగింగ్…అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు కళాశాల లెక్చరర్ల నిర్లక్షం వెరసి నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం హనుమాన్ తండాకు చెందిన మునావత్ మైనా(20) అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలో బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునావత్ మైనాను మూడు రోజుల క్రితం దేవయాది, లావణ్య అనే తన తోటి విద్యార్థినులు వేధించడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను తోటి విద్యార్థులే సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనికి తోడు ప్రాక్ట్రికల్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న నెపంతో అసిస్టెంట్ ప్రొ ఫెసర్ శ్రీనివాస్ రావు మైనాను తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మైనాపై మూడు రోజుల క్రితం దాడి చేసిన ఘటనలో దేవయాది, లావణ్య అనే వి ద్యార్థినులతో పాటు మైనాకు లెక్చరర్లు కౌన్సెలింగ్ ఇచ్చి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఇరువురిని మందలించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తన తోటి విద్యార్థిని అందరి సమక్షంలో తరగతి గదిలో దాడి చేయడం, ఈ ఘటన సెల్‌ఫోన్‌లో రికార్డు కావడం, వైరల్ కావడంతో మునావత్ మైనా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో క్రిమిసంహారక మందు సేవించి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జడ్చర్లకు తరలిస్తుండగానే మైనా మార్గ మధ్యలోనే మృతిచెందింది. ఇదిలా ఉండగా బుధవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఎవరి పై అనుమానాలు లేనట్లు తిమ్మాజిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గురువారం మైనా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఇతర విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో మూడు రోజుల క్రితం మైనాపై దాడి ఘటన, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు వేధింపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు తోటి విద్యార్థిని దాడి చేస్తున్న వీడియోను చూసిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిగ్రీ కళాశాల లెక్చరర్ల నిర్లక్షమే మైనా మృతికి కారణమంటూ తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. గురువారం ఇద్దరు విద్యార్థినిలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావులపై మైనా తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగర్‌కర్నూల్ సిఐ జక్కుల హనుమంతు తెలిపారు.
మైనా మృతికి లెక్చరర్ల నిర్లక్షమే కారణం
డిగ్రీ ద్వితియ సంవత్సరం విద్యార్థిని మైనా మృతికి జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల నిర్లక్షమే కారణమంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జడ్చర్లలోని ప్రధాన రహదారిపై మైనా మృతదేహంతో పెద్ద ఎత్తున రాస్తారోకోకు పూనుకున్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయని, ఆందోళనలు చేపట్టవద్దని హెచ్చరిస్తూ ఆందోళన కారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఘటనకు బాధ్యుడైన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావును సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. మైనాపై దాడి ఘటనను విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నేడు ఈ ఘటన జరిగి ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. పోలీసు అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
College Student Suicide allegedly harassment in Nagarkurnool