Wednesday, January 22, 2025

కొలీజియమే ఉత్తమం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయమూర్తుల ఎంపికకు నియామకాలకు కొలీజియంను సరైన ఏర్పాటుగా ఉత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం నెలకొని ఉంది. ఈ దశలోనే ప్రధాన న్యాయమూర్తి ఈ విధానం చాలా మంచిదని, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన వ్యవస్థ అని శనివారం స్పష్టం చేశారు. ఇండియా టుడే పత్రిక కాన్‌క్లేవ్ 2023లో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు. దేశంలోని న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే తప్పనిసరిగా బయటి ప్రభావం ఒత్తిళ్ల నుంచి మినహాయింపు ఉండాల్సిందే అన్నారు. ఈ క్రమంలో తనను తాను శక్తివంతం చేసుకోవల్సిందే అన్నారు. రూపొందించే ప్రతి విధానం లేదా వ్యవస్థ ఏర్పాటు పరిపక్వతతో , ఎటువంటి లోట్లు లేకుండా ఉంటుందని చెప్పలేమని, అయితే ఈ కొలీజియం వ్యవస్థను బాగా తీర్చిదిద్దామని తెలిపారు.

జుడిషియరీ స్వతంత్రతను పరిరక్షించడం తమ లక్షం అని స్పష్టం చేశారు. ఇది ప్రాణప్రదం అన్నారు. వెలుపలి శక్తుల ప్రమేయం లేదా ప్రభావం న్యాయవ్యవస్థపై పొడసూపరాదనేది కొలీజియం ఏర్పాటులో అంతర్భాగ విషయం అని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తుల ఎంపికకు సరైన ప్రాతిపదిక కాదని న్యాయశాఖ మంత్రి రిజిజూ తరచూ చెపుతూ వస్తున్నారు. మరో వైపు ఉప రాష్ట్రపతి ధన్‌కర్ కూడా ఈ వ్యవస్థ వల్ల ప్రయోజనం లేదని విమర్శించారు. వీటికి కూడా ప్రధాన న్యాయమూర్తి ఈ ఇండియాటుడే వేదిక ద్వారా సమాధానం ఇచ్చారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ప్రభుత్వం తిరస్కరించడం ఇందుకు కారణాలు తెలియచేయడం వీటిని సుప్రీంకోర్టు బహిర్గతం చేయడం పట్ల న్యాయ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇందులో తప్పేముంది? ఏదైనా విషయంపై అభిప్రాయభేదాలు ఉండటం సర్వసాధారణం లేదా అప్పుడప్పుడు ద్యోతకం అవుతాయని , ఇటువంటి వాటిని సరైన రాజ్యాంగ మేధావితనంతో పరిష్కరించుకోవల్సి ఉంటుందని తెలిపారు.

న్యాయ మంత్రి వ్యాఖ్యలపై తాను పెద్దగా స్పందించదల్చుకోలేదని, అయితే విషయాలపై వైరుధ్యాలు ఉండనే ఉంటాయనేది తెలియచేస్తున్నామన్నారు. కొలీజియం సరికాదని, ఇది మన విధానాలకు విరుద్ధం అని కూడా న్యాయ మంత్రి ఓ దశలో చెప్పారు. కేసులలో తీర్పులు ఏ విధంగా వెలువడాలనే అంశంపై తనకు తెలిసి ఎటువంటి వత్తిళ్లు ప్రభుత్వం నుంచి లేవని మంత్రి వివరించారు. తన 23 ఏళ్ల జడ్జి వృత్తి అనుభవంలో తనకు ఇటువంటి ఉదంతం ఏదీ ఎదురుకాలేదన్నారు. ప్రభుత్వం కానీ అధికార వర్గాలు కానీ తీర్పు ఈ విధంగానే ఉండాలని తమకు చెప్పిన దశ ఏదీ లేదని వివరించారు. ఎన్నికల సంఘంపై తీర్పు వల్లనే జుడిషియరీపై ఎటువంటి ఒత్తిళ్లు ఉండవనే విషయాన్ని తెలుసుకోవచ్చునన్నారు.

ఎన్నికల సంఘం ప్రధానాధికార్లు స్వతంత్రంగా ఉండాలని, ఈ క్రమంలో సిఇసి ,ఎలక్షన్ కమిషనర్ల నియామకాలు రాష్ట్రపతి ద్వారా జరగాలని , ఇందుకు సంబంధించి ప్రధాని,లోక్‌సభలో విపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా సిఫార్సుల మేరకు నియామకాలపై రాష్ట్రపతి తుదినిర్ణయం తీసుకోవాలని ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిని బట్టి తమపై ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదని సిజెఐ తెలిపారు. న్యాయవ్యవస్థలో భారతీయతను తీసుకురావల్సి ఉందని తెలిపిన సిజెఐ ఈ దిశలో తీర్పులు భారతీయ భాషలలో వెలువడాల్సి ఉంటుందన్నారు. ప్రాంతీయ భాషలలో తీర్పులు వెలువడితే అవి జనసామాన్యానికి చట్టన్యాయపరంగా ఉపకరిస్తాయని వివరించారు.

ఆదర్శప్రాయమైన వ్యవస్థ కొలీజియం
మాజీ ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్

దేశంలో న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం విధానం చాలా మంచి ప్రక్రియ అని, ఆదర్శవంతంగా నిలుస్తుందని ఇండియాటుడే కాంక్లెవ్‌లో మాజీ ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ తెలిపారు. న్యాయవ్యవస్థ పూర్తిగా అధికార యంత్రాంగం జోక్యానికి అతీతంగా ఉందన్నారు. సంపూర్ణ స్వేచ్ఛను సంతరించుకుందన్నారు. సుప్రీంకోర్టు ఓ వైపు అత్యద్భుతంగా పనిచేస్తోందని అనుకోవచ్చు అని, అయితే ఇదే దశలో ఇంకా మెరుగుపర్చడానికి అవకాశాలు ఉన్న అంశం కూడా ఉందన్నారు.

న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి పలు దఫాల సంప్రదింపులు, కింది స్థాయిలో పనితీరు సమర్థతను పరిశీలించుకుని ఓ ఏర్పాటు ద్వారా నియామకాలను చేపడుతుందని, ఇందులో ఏ దశలోనూ పక్షపాతానికి వీల్లేదన్నారు. జడ్జిల పేర్లు సిఫార్సు చేసే ముందు కేవలం వారి పనితీరు, కోర్టుల్లో వారి బాధ్యతల నిర్వహణ క్రమం ప్రధానంగానే పరిశీలనకువస్తుంది. అయితే ఇదొక్కటే కాకుండా ఇంటలిజెన్స్ బ్యూరో సమాచారం వారి నివేదికలు కూడా లెక్కలోకి తీసుకుంటారని , అంతా చట్టానికి తెలిసిన ప్రక్రియ మేరకు కొలీజియం విధానాల్లో జడ్జిల ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇది ఆదర్శప్రాయమైన వ్యవస్థ అని ఎందుకు చెపుతున్నామంటే , ఎంపిక ప్రక్రియలో ఉండేది కేవలం ఒక్కరిద్దరే కాదు మొత్తం వ్యవస్థ ప్రమేయం ఉంటుంది. వివిధ న్యాయస్థానాలలో పనితీరు విశ్లేషణ క్రమంలోనే అన్ని వడబోసుకుని తుది స్థాయిలో పేర్ల సిఫార్సు జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News