ఎన్‌జెఎసిని తీసుకురావాలి
అందుకు ఇదే తరుణం
కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి అశ్వనీ కుమార్
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుత కొలీజియం వ్యవస్థను మార్చేందుకు ఇదే తరుణం అని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి అశ్వనీ కుమార్ ఆదివారం ప్రకటించారు. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అనుకూలంగా ‘ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ బలంగా ముందుకు సాగుతోంది’ అని ఆయన ‘పిటిఐ’ తో ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. న్యాయమూర్తులపై ఆరోపణలతోసహా న్యాయవ్యవస్థను కుదిపివేస్తున్న సమస్యలను పరిహరించేందుకు ఒక పటిష్ఠ అంతర్గత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సుప్రీం కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను అంతర్గతంగా వేధిస్తున్న సమస్యలు, న్యాయమూర్తుల నియామకాలు, జాతీయ న్యాయవ్యవస్థ నియామకాల కమిటీ (ఎన్‌జెఎసి), పార్లమెంట్‌లో ఆమోదించిన, కోర్టుల్లో అంతకంతకు సవాల్ చేస్తున్న చట్టాలు వంటిపలు వివాదాస్పద అంశాలపై అశ్వనీ కుమార్ ఇంటర్వూలో మాట్లాడారు.
‘ఎన్‌జెఎసికి సరైన సమయం 201415లో వచ్చింది. అప్పుడు ఎన్‌జెఎసిని ప్రతిపాదించి వోటింగ్‌కు పెట్టారు. దానికి ఇప్పుడు కచ్చితంగా తరుణం. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పటిష్ఠంగా ముందుకు సాగుతోంది. అది ప్రతిపాదిత ఎన్‌జెఎసి తరహాలో కావచ్చు, ఇంకా మెరుగైనది కావచ్చు’ అని అశ్వనీ కుమార్ అన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం మార్చిన రాజ్యాంగ సవరణను తీసుకువచ్చే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉందని, అది న్యాయవ్యవస్థ పరిశీలనకు సంతృప్తికరమైన అంశమేనని కాంగ్రెస్ మాజీ నేత అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. యుపిఎ హయాంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అశ్వనీ కుమార్ ఉన్నప్పుడే ఎన్‌జెఎసి బిల్లు ముసాయిదా రూపొందించారు. అయితే, ఎన్‌డిఎ అధికారాన్ని చేపట్టిన తరువాత సవరించిన రూపంలో ఆ బిల్లును ఆమోదించారు.
కానీ సుప్రీం కోర్టు 2015 అక్టోబర్‌లో దానిని కొట్లివేసింది. ఎన్‌జెఎసిని తీసుకురావలసిన తరుణం ఇదేనని ఎందుకు భావిస్తున్నారన్న ప్రశ్నకు కుమార్ సమాధానం ఇస్తూ, ఎన్‌జెఎసిని రాజ్యాంగవిరుద్ధమైనదిగా కొట్టివేసిన తీర్పు చెల్లుబాటును తాను వ్యతిరేకిస్తున్నానని, ఆ బిల్లుకు ‘పార్లమెంట్ మెజారిటీ ఆమోదం లభించింది’ అని చెప్పారు. ఎన్‌జెఎసిలో ప్రభుత్వం నియమించే ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ ప్రతినిధుల వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలుగుతుందనేదే ఎన్‌జెఎసి వ్యవస్థను కోర్టు తిరస్కరించడానికి ప్రధాన కారణం అని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం సహా పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద చట్టాలను కోర్టుల్లో అంతకంతకు సవాల్ చేస్తుండడం గురించి కుమార్ ప్రస్తావిస్తూ, అత్యంత సమీప భవిష్యత్తులో దేశం, రాజకీయ, న్యాయవ్యవస్థ ప్రక్రియలు తేల్చవలసిన ప్రధాన సమస్యల్లో అది ఒకటి అని అన్నారు.