బొగొటా: మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడు అయిన డైరో ఆంటోనియో ఉరఫ్ ‘ఒటోనియల్’(50)ను పట్టుకున్నట్లు కొలంబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ప్రపంచంలో కొకైన్‌ను అత్యధికంగా అక్రమ ఎగుమతి చేసే వ్యక్తిని పట్టుకోవడం ఓ విజయమనే చెప్పాలి. కొలంబియా దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పేరుగాంచిన ముఠా ‘గల్ఫ్ క్లాన్’కు అతడు నాయకుడు. పనామా సరిహద్దు సమీపంలో నెకోక్లి వద్ద అతడిని పట్టుకున్నారు. కొలంబియాలో అత్యంత భయంకరుడు అయిన ఒటోనియల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 50 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తానని అమెరికా ప్రకటించింది. అమెరికాలో ఒటోనియల్ను దోషిగా నిర్ధారించారు. అతడిని తమ దేశానికి అప్పగించాలని కూడా అమెరికా కోరుతోంది. అమెరికా దక్షిణాది జిల్లా అయిన న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అతడిని హాజరుపరుచనున్నారు.
కొలంబియాలోని 300 మున్సిపాలిటీలలో అతడి ముఠా ‘గల్ఫ్ క్లాన్’ పనిచేస్తోందని సమాచారం. గల్ఫ్ క్లాన్ను ఇదివరలో ‘ఉసుగా ముఠా’ అని పిలిచేవారు. ఒటోనియల్ను పట్టుకోడానికి కొలంబియా కనీసం 1000 మంది సైనికులను నియమించింది. పేద కుటుంబంలో జన్మించిన ఒటోనియల్ మార్కిస్టు గెరిల్లా గ్రూప్ అయిన పాపులర్ లిబరేషన్ ఆర్మీ(ఇపిఎల్)లో 1991లో చేరాడు. అయితే 2006లో రైట్‌వింగ్ అధ్యక్షుడు అల్వరో యురిబె పాలన పిలుపు మేరకు ఆ గ్రూప్ నుంచి చాలా మంది వైదొలిగారు. కానీ ఒటోనియల్ మాత్రం ఇపిఎల్లోనే ఉండిపోయాడు.
కొకైన్ ఎగుమతిలో కొలంబియా దేశమే అగ్రదేశంగా ఉంది. దానికి అమెరికాయే పెద్ద మార్కెట్. కొకైన్ మాదకద్రవ్యం స్మగ్లింగ్‌ని నివారించేందుకు అర శతాబ్దం ముందే చర్యలు తీసుకున్నారు. కొలంబియాలో ప్రభుత్వం ఉనికి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో… గల్ఫ్క్లాన్, అసమ్మతి గ్రూపుకు చెందిన ఎఫ్ఎఆర్సి గెరిల్లాలు, వామపక్ష ఇఎల్ఎన్ తిరుగుబాటుదారులు మాదకద్రవ్యాల అక్రమ రవాణామార్గాలను, అక్రమంగా పనిచేస్తున్న గనులను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు హింసాత్మక పోరాటాలు చేస్తుంటాయి.