చెన్నై : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధిపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి తలపై రూ. 10 కోట్ల రివార్డు ప్రకటించారు. ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే తానే చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపులపై ఉదయనిధి స్పందిస్తూ ‘ నా ప్రాణాలకు ముప్పు ఉంది. నా తలకోసం రూ. 10 కోట్లు అవసరం లేదు.
నా తల దువ్వుకోడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుంది. నాకోసం అంతమొత్తం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమీ కాదు. ఎవరి బెదిరింపులకు భయపడను. తమిళనాడు ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి (కరుణానిధి ) మనవడిని నేను ‘అంటూ స్వామీజీ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఇదిలా ఉండగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి స్పష్టం చేశారు. అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, డిఎంకె మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.