రాంపూర్(యుపి): ఆస్ట్రేలియాలో ఇటీవలే వివాహం చేసుకుని తన బంధువులతో వేడుకలు చేసుకోవడానికి రాంపూర్ వచ్చిన ఒక 27 ఏళ్ల యువకుడు రైతుల ఆందోళన సందర్భంగా ఢిల్లీలో మరణించాడు. 27 ఏళ్ల నవ్రీత్ సింగ్ పై చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు. ఇటీవలే అక్కడ ఆయనకు వివాహమైంది. ఆ వివాహ వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవడానికి ఆయన ఈ మధ్యే ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలం రాంపూర్ చేరుకున్నారు.
తన బంధువులు పిలవడంతో రైతుల ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి ఆయన కూడా ఢిల్లీ చేరుకున్నారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఢిల్లీలోకి ప్రవేశించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఐటిఓ వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న బ్యారికేడ్లను బద్ధలుకొట్టుకుని దూసుకెళ్లే ప్రయత్నంలో ఒక ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ట్రాక్టర్ నడుపుతున్న నవ్రీత్ సింగ్ బోల్తాపడిన ట్రాక్టర్ కింద నలిగి అక్కడకిక్కడే మరణించారు.
అయితే పోలీసులు జరిపిన కాల్పులలో బుల్లెట్ తగిలి నవ్రీత్ సింగ్ మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఈ వదంతులను ఖండించారు. సిసిటివి ఫుటేజ్‌లో అటువంటిదేదీ నమోదు కాలేదని, ట్రాక్టర్ బోల్తాపడడంతోనే నవ్రీత్ సింగ్ మరణించినట్లు వారు స్పష్టం చేశారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం నవ్రీత్ సింగ్ మృతదేహం రాంపూర్ చేరుకోవడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుల చేశారు.