ప్రపంచ ప్రజలు అందరూ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూతలానికి క్షేమంగా తిరిగి రావడాన్ని ఆసక్తితో, అచ్చెరువుతో చూశారు. ఆ సమయంలో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం సునీతా విలియమ్స్ పేరుతో ఆన్‌లైన్ శోధన 2 మిలియన్లకు చేరుకుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ వారసత్వం కలిగిన రెండవ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అనుభవశాలియైన సుప్రసిద్ధ నాసా వ్యోమగామి, మాజీ అమెరికన్ నేవీ కెప్టెన్, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ కమాండర్. ఆమె సెప్టెంబర్ 19, 1965న ఒహాయోలోని యూక్లిడ్‌లో డాక్టర్ దీపక్ పాండ్యా, బోన్నీ పాండ్యా దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా ఒక న్యూరో -అనాటమిస్ట్.
ఆయన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ఝులాసాన్ గ్రామంలో జన్మించాడు. సునీత భర్త మైఖేల్ విలియమ్స్. నీధామ్, మసాచుసెట్స్ ఆమె స్వస్థలం. నీధామ్ హైస్కూల్లో చదువుకుని, 1987లో అమెరికన్ నేవల్ అకాడమీ నుండి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో పిజి పట్టా పొందారు. అంతరిక్ష యానానికి ప్రసిద్ధి చెందిన విలియమ్స్ ఆశావహులైన వర్తమాన, భవిష్యత్ వ్యోమగాములకు ఒక శక్తివంతమైన ఆదర్శమూర్తిగా నిలిచారు. ప్రజలు భావించినట్లు ఆమె అంతరిక్షంలో ఇరుక్కుపోలేదు లేదా చిక్కుకు పోలేదు అని నాసా స్పష్టం చేసింది.
ఆ వ్యోమగాములను రక్షించడానికి అంతరిక్ష సంస్థ అన్ని వేళలా లైఫ్‌బోట్స్‌ను సిద్ధంగా ఉంచింది. అయితే వారిని తిరిగి తీసుకురావడానికి ఏజెన్సీ సరైన సమయం కోసం వేచివుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు గడిపి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్రూ-9 బృందంతో కలిసి మార్చి 19, బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వచ్చారు. ఆమె త్వరలో భారత దేశానికి రానున్నదని ఆమె బంధువు తెలియపరిచారు. సునీతా విలియమ్స్ కెరీర్‌లో మొత్తం 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచిన మొదటి మహిళా వ్యోమగామి. నాసా సంస్థ సర్వకాలిక స్పేస్ వాక్ జాబితాలో ఆమెది నాల్గవ స్థానం. విలియమ్స్ మూడు అంతరిక్ష యాత్రలలో 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. జూన్ 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికైన సునీతకు ఆగస్టు 1998లో శిక్షణ మొదలైంది.
తన మొదటి అభియానం తర్వాత, ఆమె ఆస్ట్రోనాట్ ఆఫీస్ సహాయక అధికారిగా పదవి చేపట్టారు. అటుపై ఆమె ఎక్స్‌పెడిషన్ 32లో ఫ్లైట్ ఇంజినీర్‌గా, ఎక్స్‌పెడిషన్ 33లో అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కమాండర్‌గా దీర్ఘకాలిక మిషన్‌కు మద్దతునిచ్చారు. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో దాని మొదటి సిబ్బందితో కూడిన విమానాన్ని ప్రయోగించారు. జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మొదట్లో దాదాపు ఒక వారం పాటు ఈ అంతరిక్షయానం కొనసాగుతుందని భావించినప్పటికీ, వారి స్టార్లైనర్ మిషన్ బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో సమస్యల కారణంగా ఈ అభియానం తొమ్మిది నెలలకు పైగా పొడిగించవలసి వచ్చింది.
అందుచేత వారు తిరిగి రావడంలో ఆలస్యం జరిగింది. స్టార్లైనర్ సిబ్బంది లేకుండా తిరిగి రావాలని నాసా సంస్థ నిర్ణయించిన తర్వాత, ఈ ఇద్దరు వ్యోమగాములు ఎక్స్‌పెడిషన్ 71/72 సిబ్బందిగా మారారు. మార్చి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూతలానికి క్షేమంగా తిరిగి వచ్చారు.వారి మిషన్ అనుకున్న వ్యవధి కంటే చాలా ఎక్కువగా విస్తరించినప్పటికీ విలియమ్స్, విల్మోర్ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారు 900 గంటలకు పైగా పరిశోధన, అభివృద్ధిలో నిమగ్నమై, 150కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
జీవవ్యవస్థలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేయడం, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణానికి కొత్త సాంకేతికతలను పరీక్షించడం వారి ముఖ్యమైన అధ్యయనాలలో కొన్ని. వారి ముఖ్యమైన ప్రయోగాలలో ఒకటి యూరోపియన్ ఎన్హానస్డ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సైజ్ డివైస్ (ఈ4డి) ని పరీక్షించడం. ఇది సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను మిళితం చేస్తుంది.ఇది వ్యోమగాములు అంతరిక్షంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కండరాలు, ఎముకలు దృఢత్వాన్ని కోల్పోవటం గురించిన వారి పరిశోధన భవిష్యత్‌లో అంతరిక్షయానాలకు కీలకం అవుతుంది. వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చాక ‘వాస్కులర్, కార్డియో రీకండిషనింగ్’ చేయించుకోవలసి ఉంటుంది.
వ్యోమగాముల శరీరం మైక్రోగ్రావిటీలో ఉండటానికి అలవాటు పడటం చేత, తల తిరుగుతున్నట్లు, లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తుంది’ అని నాసాకు చెందిన స్టీవ్ స్టిచ్ మీడియాతో అన్నారు. సాహసనారి కల్పన కల్పన తొలి భారతీయ అమెరికన్ వ్యోమగామి. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ. ఆమె తొలిసారిగా 1997లో స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్ట్ పదవిలో ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా ప్రయాణించారు. కల్పనా చావ్లా పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఈ కోర్సును ఎంచుకునేటప్పుడు, భారతదేశంలో ఈ కెరీర్ మార్గాన్ని అనుసరించే అమ్మాయిలకు పరిమిత అవకాశాలు ఉన్నందున, ప్రొఫెసర్లు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అయితే, చావ్లా ఇదే తాను నిర్ణయించుకున్న అంశమని పట్టుబట్టారు.
భారతబాలికలకు సైన్స్ విద్య అవకాశాలను అందించడం పట్ల చావ్లాకు ఎంతో మక్కువ ఉండేది. ఆమె వ్యోమగామిగా ఉన్న సమయంలో కల్పన చదువుకున్న బడి పిల్లలకు నాసా సంస్థ సమ్మర్ స్పేస్ ఎక్స్‌పీరియన్స్ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించింది. 1998 నుండి ప్రతి సంవత్సరం, ఆ స్కూల్ ఇద్దరు బాలికలను హ్యూస్టన్‌లోని ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్పేస్ ఎడ్యుకేషన్ యునైటెడ్ స్పేస్ స్కూల్‌కు పంపేది. కల్పన ఆ బాలికలను తన ఇంటికి భారతీయ విందుకు ఆహ్వానించేది. కల్పనా చావ్లా కొలంబియా అంతరిక్ష షటిల్ (1997) నుండి అనేక ప్రయోగాలను నిర్వహించింది. వాటిలో సూక్ష్మగురుత్వాకర్షణలో మొక్కల పునరుత్పత్తిని అధ్యయనం చేసే ప్రాజెక్టులు, అంతరిక్షంలో పదార్థాలు ఎలా ప్రవర్తిస్తాయో అధ్యయనం చేయడం వంటివి ఉన్నాయి.
అదనంగా, చావ్లా రోబోటిక్ ఆర్మ్న్ ఉపయోగించి స్పార్టాన్ 201 అనే ఉపగ్రహాన్ని మోహరించారు. ఇది సూర్యుని బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడింది. 2003లో, స్పేస్‌షటిల్ కొలంబియా విపత్తులో దురదృష్టవశాత్తు మరణించిన ఏడుగురు సిబ్బందిలో కల్పన ఒకరు. అయితే, చావ్లా వారసత్వం కొనసాగుతోంది. ముఖ్యంగా, ఆమె ప్రతిభ, కృషి భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా యువత అంతరిక్షయానంలో కెరీర్లను పరిగణించేలా ప్రేరణ నిచ్చింది.