నల్గొండ :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చివరి రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,మున్సిపల్ చైర్మన్ ఎం. సైది రెడ్డి,జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి, తదితరులతో కలిసి క్లాక్ టవర్ సెంటర్ లో అమరవీరుల స్థూపం,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారి విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అమరులకు సంతాపం తెలుపుతూ ప్రత్యేక తీర్మానం,అమరుల సంస్మరణ కు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తొలి, మలిదశ ఉద్యమాలలో అమరులైన వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 1956లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం, 1969లో మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించి 369 మంది మరణించారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడూ నిరంతరం తెలంగాణ భావ జాలాన్ని వ్యాప్తి చేస్తూ సమావేశాలు నిర్వహించే వారన్నారు. అలా ప్రొఫెసర్ జయ శంకర్ కెసిఆర్‌తో చర్చించి ఆంధ్రతో కలిసి ఉండటం వలన తెలంగాణ ఎలా నష్టపోతుంది అని గణాంకాలతో సహా వివరించారు. కె.చంద్ర శేఖర్ రావు అలా మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం నిరాహార దీక్ష చేసి సబ్బండ వర్గాల,అన్ని వర్గాల ప్రజలను కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులు ఈ సమయంలో తెలంగాణ రాకుంటే మా భవిష్యత్తు తరాలు అంధకారంలో ఉండాల్సి వస్తుందని మనోవేదనకు గురై తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు గావించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్త గా ఏర్పాటైన, చిన్న రాష్ట్రం అయినా అభివృద్ధిలో చాలా ముందుంది అన్నారు.
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు,ఉద్యోగులు నలిగిపోయారన్నారు. బడ్జెట్లో అగ్ర భాగం ఆంధ్రకు కేటాయించుకొని, తెలంగాణకు తక్కువ బడ్జెట్ ఇచ్చేవారన్నారు. ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తది అని కెసిఆర్ ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రమంతా పర్యటించి లక్షల మందిని ప్రభావితం చేశారన్నారు. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణ ప్రకటన ఇప్పించారన్నారు. కెసిఆర్ చేసిన పోరాటాలు అమరుల త్యాగాలలో ముఖ్యంగా శ్రీకాంతాచారి తెలంగాణ సాధనకు ఆత్మబలిదానం చేసుకొని మరణిస్తూ కూడా జై తెలంగాణ అని నినదించారని గుర్తు చేశారు.అమరుల కుటుంబాలకు వారు తెలిపిన విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు,ఇతర సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తా మని అన్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 9 సంవత్సరాలలో తెలంగాణలో సమూలమైన మార్పులు జరిగాయి అన్నారు. తెలంగాణ కోసం మన జిల్లాలో 26 మంది అమరులైనట్లు తెలిపారు. అమరులైన కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం కల్పించామని, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. అమరుల త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకునేలా హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపా రు. అమరుల త్యాగం వెలకట్ట లేమని,అమరుల త్యాగం వల్లనే తెలంగాణ సాధించుకున్నామని వారి త్యాగఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలం అన్నారు.
అమరులను స్మరించుకునేందుకు విశేష సమావేశం జిల్లా పరిషత్, మున్సిపల్ గ్రామపంచాయతీ లలో ఏర్పాటుచేసి ప్రత్యేక తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.అమరుల కుటుంబాలకు చెందిన వారిని శాలువా, మోమొంటొలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి,జడ్‌పివైస్ చైర్మన్ ఇ రిగి పెద్ధులు, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా పరిషత్ నుండి గడియారం సెంటర్లో గల అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా పరిషత్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు.