హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సిఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం జరిగే అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో అమర వీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించాలని, గ్రామాలలో ఉన్న అమర వీరుల స్ధూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించాలని సూచించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేశారని జిల్లా కలెక్టర్లను, వివిధ విభాగాల అధికారులను, ప్రభుత్వ సిబ్బందిని సిఎస్ అభినందించారు. ప్రతి గ్రామంలో ఉదయం 11 గంటలకు సమావేశమై, అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలని కోరారు. ఈ సందర్భంగా అమరుల సంస్మరణ తీర్మానం, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలని, నిర్ణీత ఫార్మాట్ లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలని సిఎస్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్థనా సమావేశంలో అమరుల స్మృతిలో 2 నిమిషాలు మౌనం పాటించి, వారి త్యాగాలను ప్రస్తుతించాలన్నారు.