మరో రెండు రోజులు వర్షాలే
వచ్చే వారం సూపర్‌సైక్లోన్ ముప్పు
సిత్రాంగ్‌గా నామకరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావటంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రుతుపవనాలు బీహార్ , సిక్కిం, మేఘాలయ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, విదర్భ, చత్తిస్‌గఢ్ ,మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలనుంచి ఉపసంహరించుకున్నాయి. రాగల రెండు రోజుల్లో విదర్బ ,చత్తిస్‌గఢ్ ,ఇంటీరియర్ మహారాష్ట్ర, , జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు ,ఇంటిరియర్ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు , మొత్తం పశ్చిమబెంగాల్ నుంచి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని , రుతుపవనాలు వెళుతూ వెళూతూ మరో రెండు రోజుల పాటు జల్లులు కురిపించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. ఆకాశం మేఘావృతంగా ఉన్నా , రాత్రిపూట జల్లులు పడే అవకాశ ం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
వచ్చే వారం ఏపికి సూపర్ సైక్లోన్
పోరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వారం సూపర్‌సైక్లోన్ ముప్పు పొంచివున్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.దీని ప్రభావంతో భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది ఈ నెల 20నాటికి అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని తెలిపింది.అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తుందని తెలిపింది. ఆ తరువాత ఇది తుఫాన్‌గా మారనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాన్‌కు సిత్రాంగ్‌గా నామకరణం చేసింది. గ్లోబల్ పోర్ కాస్ట్ సిస్టమ్ (జిఎఫ్‌ఎస్) దీన్ని సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శనివారం రాష్ట్రంలోని నల్లగొండ, రామగుండం, మెదక్, ఖమ్మం, హైదరాబాద్, భధ్రాచలం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.