Monday, December 23, 2024

‘కమర్షియల్’గా దోపిడీ?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆ శాఖలో కొంతమంది అధికారులు ‘కమర్షియల్ ’గా ఆలోచిస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును వారి ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. వ్యాపారులకు మేలు చేసి ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్‌ను ఎగ్గొట్టేలా చేసి అందులోని సగం సొమ్మును కొంతమంది ‘కమర్షియల్’ అధికారులు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. మరికొందరు అధికారులు ఏకంగా తాము పనిచేసే కార్యాలయాలకు రాకుండానే వ్యాపారుల నుంచి తమ మాముళ్లను వసూలు చేసుకుంటూ ఉన్నతాధికారులు అడిగితే తాము ఫీల్డ్‌లో ఉన్నామని కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఈ శాఖ ప్రభుత్వానికి ఆదాయం కురిపించడంలో నెంబర్‌వన్‌గా ఉంది. ఈ ఆర్థిక సంత్సరం ముగిసేలోగా సుమారు రూ. 82 వేల కోట్ల పైచిలుకు ఆదాయా న్ని ఆర్జించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు టార్గె ట్ పెట్టుకొని పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ములో సగం తమ ఖాతాలకు మిగతాది ఆ వ్యాపారుల ఖాతాలకు మళ్లించడం విశేషం. ఇప్పటికే ఇంటిదొంగలపై దృష్టి సారించిన కమిషనర్‌ను సైతం ఆ అధికారులు తప్పుదారి పట్టిస్తూ అందినకాడికి దోచుకోవడం విశేషం. ఖమ్మం జిల్లాలోని ఓ అధికారి పలువురు వ్యాపారులకు ట్యాక్స్ ఎగ్గొట్టే ప్లాన్ ఇచ్చి దానిని పక్కాగా అమలు చేసి వారి నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులను వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆబిడ్స్‌లో పనిచేసే మరో అధికారి సైతం తన కార్యాలయానికి రాకుండా తన పరిధిలో ఉన్న వ్యాపారుల నుంచి ప్రతిరోజు తనకు వచ్చే కలెక్షన్ ఠంచన్‌గా వసూలు చేసుకుంటూ వ్యాపారులు చేసే జీరో దందా గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆబిడ్స్‌లో పనిచేసే అధికారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక అభ్యర్థికి సంబంధించిన క్రికెట్ కిట్‌లతో కూడిన మూడు వాహనాలను పట్టుకోవడంతో అప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి రంగంలోకి దిగి ఆ అధికారికి భారీగా ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తడం విశేషం.

ఫాల్ సీలింగ్ పేరుతో లక్షలు స్వాహా
ఇక చార్మినార్ డివిజన్‌లో గతంలో పనిచేసిన ఓ అధికారి లెక్కకు మించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపణలున్నాయి. వ్యాపారుల నుంచి తనకు వచ్చే రోజువారి కలెక్షన్‌లను రాబట్టుకోవడంతో ఆయనపై ఆనేక ఫిర్యాదులు రావడంతో ఆయన్ను అక్కడి నుంచి తప్పించి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారని తెలుస్తోంది. అయితే రోజు వారి కలెక్షన్‌లను చూసిన ఆయన ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోని మరమ్మతుల పేరుతో (ఫాల్ సీలింగ్) పేరుతో ఇప్పటికే లక్షలను స్వాహా చేసినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ఆయన ప్రస్తుతం ఉద్యోగుల బదిలీల్లోనూ అవకతవకలు చేశారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మధ్యన 16 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 8 మందికి మాత్రమే బదిలీ చేసిన ఈ అధికారి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 8 మందిలో ఇద్దరు నిజామాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన ఉద్యోగులు ఉండగా, వారు గతంలో పనిచేస్తున్న చోటుకు మళ్లీ వారిని బదిలీ చేయడం విశేషం.
వీరిద్దరిపై గతంలో ఆయా జిల్లాలో పనిచేసే అధికారులు, వ్యాపారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందినా మరోసారి వారిద్దరిని ప్రస్తుతం అక్కడికే పంపించడం, ఈ అధికారి అత్యుత్సాహం వల్లే జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈయన చేసిన బదిలీలకు సంబంధించి సంబంధిత ఎస్టాబ్లిష్‌మెంట్ ఉన్నతాధికారికి (అడిషనల్ కమిషనర్‌కు) పూర్తిగా తెలియకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని, సంబంధిత అడిషనల్ కమిషనర్ దీనికి సంబంధించి ఆ అధికారిని వివరాలు అడిగితే ఆయన తనదైన స్టైల్‌లో పైనుంచి ఉత్తర్వులు వచ్చాయని సంబంధిత అడిషనల్ కమిషనర్ చెప్పి నోరుమెదపకుండా చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
12 గంటల డ్యూటీ కోసం రూ.3 నుంచి రూ.4 వేలు
ఇక డివిజన్‌లలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది రోజువారి (12 గంటల) డ్యూటీల కోసం డివిజన్‌లలో ఉండే మేనేజర్‌లకు ఒక్కొక్కరూ రూ.3 నుంచి రూ.4 వేలు ఇవ్వాలసిందేనన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఇలా రోజు వారీ డ్యూటీల కోసం డబ్బులిచ్చి ఉద్యోగులకు రోజుకు రూ.5 నుంచి రూ.10 వేలు దొరుకుతుందని ఈ డ్యూటీల కోసం చాలామంది ఉద్యోగులు పోటీపడుతున్నట్టుగా ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు పేర్కొనడం విశేషం. ఇలా ఎవరికీ వారే ఈ శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతుండడంతో వారిపై ప్రస్తుత కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News