హోటల్స్ రెస్టారెంట్లకు రుచికరం
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాసు
సిలిండర్‌కు రూ.175 చొప్పున కుదింపు
వైమానిక ఇంధన ధర 2.45 శాతం తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్యపరమైన ఎల్‌పిజి, విమాన ఇంధన ధరలను తగ్గించారు. వాణిజ్య సముదాయాలు అంటే హోటల్స్, రెస్టారెంట్లు వంటివి వినియోగించే వాణిజ్య వంటగ్యాసును సిలిండర్‌కు రూ 175 చొప్పున గణనీయంగా తగ్గించారు. ఇక జెట్ ఫ్యూయల్(ఎటిఎఫ్) రేటును 2.45 శాతం మేరకు తగ్గించారు. అంతర్జాతీయ చమురు ధరలు కాస్తా చల్లబడిన దశలో ఇప్పుడు ఇక్కడ దేశీయ మార్కెట్‌లో ధరలను సవరించినట్లు అధికారవర్గాలు సోమవారం తెలిపాయి. ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర ఢిల్లీలో రూ 1,856. 5గా ఉంది. ఇప్పుడు రేట్లు తగ్గడంతో ఇకపై ఇది రూ.2028గా ఖరారు అయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధీనపు చమురు సంస్థల రిటైలర్లు ధరల ప్రకటనలో వెల్లడించారు. కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలు తగ్గడం నెలరోజుల్లో ఇది రెండోసారి అయింది. ఎప్రిల్ 1వ తేదీన రేటును సిలిండర్‌కు రూ 91.5గా తగ్గించారు. ఇప్పుడు వంటగ్యాసు సిలిండర్ల ధరలను మార్చలేదు.
ఇది దేశ రాజధానిలో ఇప్పుడు రూ 1,103 (14.2 కిలోల సిలిండర్ ధర)గా ఉంది. ఇంటింటి వాడకపు వంటగ్యాసు ధరలను మార్చి 1న సిలిండర్‌కు రూ 50 చొప్పున పెంచారు. ప్రతి నెలా వంటగ్యాసు ధరలను ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు సవరిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా వీటిలో హెచ్చుతగ్గులు జరుగుతాయి. ఇక ఇప్పుడు ఎటిఎఫ్ ధరలను అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 2.45 శాతం మేర తగ్గించారు. ఇప్పుడు తగ్గించిన రేట్ల ప్రకారం ఢిల్లీ వరకూ చూస్తే ఈ రేటు ఇప్పుడు కిలోలీటర్‌కు రూ.2414.25 వరకూ తగ్గించారు. ఈ విధంగా ఇప్పుడు దీని రేటు కిలో లీటర్‌కు రూ 95,935.34 గా ఉంటుంది.