Sunday, February 16, 2025

మహారాష్ట్రలో లవ్ జిహాద్‌పై కమిటీ

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రేమ (లవ్ జిహాద్) పేరుతో సాగుతున్న మతమార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు మతమార్పిడులకు సంబంధించిన సంఘటనలకు అడ్డుకోవడానికి వేర్వేరు రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను, న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈ కమిటీలో మహిళ,శిశు సంక్షేమ,మైనార్టీ వ్యవహారాలు, శాసన, న్యాయ వ్యవహారాలు, సామాజిక న్యాయం, విభాగాలకు చెందిన సెక్రటరీలు, హోమ్‌శాఖ డిప్యూటీ సెక్రటరీలు ఉంటారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు మంగళ్ ప్రభాత్ లోథా, రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల రక్షణకు, సాంస్కృతిక విలువలను కాపాడుకోడానికి ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో మహిళా, శిశు సంక్షేమాభివృద్ది విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు మతాంతర వివాహ నిఘా కమిటీని ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అలాంటి సంఘటనలు నివారించడంలో చెప్పుకోదగిన చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఈ సందర్భంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్యల సంఘటనలను ప్రస్తావించారు. ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిసారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు ప్రేమ , పెళ్లి అనేవి వ్యక్తిగత వ్యవహారాలని పేర్కొన్నారు. ముస్లింలను వేధించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ అబు అజ్మీ పేర్కొన్నారు. లవ్‌జిహాద్ అనేది ఓ అపోహ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ హుస్సేన్ దల్వాయి అన్నారు. దేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News