ఇందుకు అనుగుణంగా నియమావళి రూపొందించాలి: ప్రాజెక్టుల నిర్వహణ కమిటీ, జలసౌధలో జరిగిన భేటీ
హాజరుకాని తెలంగాణ, ముసాయిదా అందజేసిన కమిటీ
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన నియమావళి రూపొందించాలని కృష్ణానదీయజమాన్యబోర్డు నియమించిన ప్రాజెక్టుల నిర్వహణ కమిటి అభిప్రాయపడింది. సోమవారం నాడు జలసౌధలోని కృష్ణాబోర్డు కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. బోర్డు సభ్యుడు కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపి నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డితోపాటు జన్కొ ఆధికారులు హాజరుకాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరూ హాజరుకాలేదు. ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం డైరెక్టర్ శ్రీవాస్తవ కూడా ఢిల్లీ నుండి దృశ్యమాద్యమం ద్వారా హాజరయ్యారు. సమావేశంలో శ్రీశైలం , నాగార్జున సాగర్ జలాశయాలనుంచి నీటి విడుదలకు సంబంధించిన నియమావళిపై చర్చించారు. జలవిద్యుత్ ఉత్పత్తి ఎప్పడు చేయాలి, ప్రాజెక్టులనుంచి నీటిని ఎప్పడు వినియోగించుకోవాలి, వరదల సమయంలో నీటి లెక్కింపు ఎలా జరగాలి తదితర అంశాలపై చర్చించారు. రూల్‌కర్వ్ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి చెందిన అధికారులు కొన్ని వివరణలు అడిగారు.
జలవిద్యుత్ ఉత్పత్తి , వరదల సమయంలో నీటి లెక్కింపును రాష్ట్రాల కోటా నీటిలో జమ చేయాలా లేక వదరనీటిగా వదిలేయాలా అన్న అంశాలపై చర్చజరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అధికారులు హాజరు కాలేకపోవటంలో ముసాయిదా లోని అంశాలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు మూసాయిదా ప్రతిని తెలంగాణ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకుంటామని కన్వీనర్ పిళ్లే సమావేశంలో వెల్లడించారు. జూన్ మొదటి వారంలో మరో మారు సమావేశం నిర్వహించి అన్ని అంశాలను సమగ్రంగా చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాతే ముసాయిదాకు ఆమోదం తెలిపి కృష్ణానదీయాజమాన్యబోర్డుకు తుది నివేదిక అందజేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఏపి నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ప్రాజెక్టుల నీటివిడుదల నిర్వహణ నియమావళి ఉంటుందని పేర్కొన్నారు.