న్యూఢిల్లీ: నేర సంబంధిత వీడియోలు, ఫోటోల కోసం ఢిల్లీ పోలీసులు వినియోగిస్తున్న మొబైల్ యాప్‌లపై నిపుణుల పరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశించింది. నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించే లక్షానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. నేర సంబంధిత వీడియోలు, ఫోటోలను సాక్షాలుగా పరిగణించడంపై జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. నేర దృశ్యాల విషయంలో యాప్‌ల ద్వారా అప్లోడ్ చేసిన వీడియోలు, ఫోటోలు ట్యాంపరింగ్ కాకుండా పూర్తిస్థాయిలో నిక్షిప్తం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమూనాగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ఓ నిర్ణయానికి రావడానికి ముందు నిపుణుల పరీక్ష అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కనీసం ముగ్గురు ఉన్నతాధికారులైనా నిపుణుల కమిటీలో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. సైబర్‌క్రైమ్ నిపుణులు లేదా వర్చువల్ సాంకేతికతలో అనుభవజ్ఞుల సహకారం తీసుకునేందుకు నిపుణుల కమిటీకి స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. కోర్టు సహాయకుడు, సీనియర్ న్యాయవాది డా॥ అరుణ్‌మోహన్ సహకారం కూడా తీసుకోవచ్చునని ధర్మాసనం సూచించింది.