Wednesday, January 22, 2025

అసెంబ్లీల ఎన్నికల తర్వాతే ఎంఎస్‌పిపై కమిటీ: తోమర్

- Advertisement -
- Advertisement -

Committee on MSP after Assembly Elections: Tomar

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తర సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా తోమర్ వివరణ ఇచ్చారు. అయితే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పై ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని వెల్లడించారు. “పంటల వైవిధ్యం, సహజ సేద్యం, కనీస మద్దతు ధరపై సమర్థవంతమైన, పారదర్శకమైన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిపై పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పై కమిటీ ఏర్పాటు నిమిత్తం ఎన్నికల సంఘానికి(ఈసికి) లేఖ రాశాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది” అని నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

సంయుక్త కిసాన్ మోర్చా కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేస్తానని తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలేదని నిలదీశాకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పిపై కమిటీ ఏర్పాటు విషయంలో రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైన బిజెపిని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను కోరింది. కాగా ఇసి ఆమోదం కోసం ప్రభుత్వం ఎన్నికల సంఘానికి(ఈసికి) లేఖ రాసినట్లు తోమర్ వివరణ ఇచ్చారు. “ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాకే కమిటీని ఏర్పాటుచేయాలని కోరింది” అన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తోమర్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో “ మారుతున్న దేశ విధానానికి అనుగుణంగా పంటల మార్పిడి పద్ధతికి మారాల్సి ఉంది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)ను మరింత పారదర్శకంగా మార్చాల్సి ఉంది. సేద్యంలో సహజ సేద్యాన్ని ప్రోత్సాహించాల్సి ఉంది. ఎంఎస్‌పిపై కమిటీ ఏర్పాటు ప్రాసెస్‌లో ఉంది” అన్నారు.

బిజెడి సభ్యుడు ప్రసన్న ఆచార్య అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి న్యాయ భద్రత(లీగల్ గ్యారంటీ) కల్పించే విషయంలో ప్రభుత్వం యోచిస్తోందన్నారు. 2018కి పూర్వం కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) విషయంలో ఎలాంటి యంత్రాంగం లేదని, సేద్యం లాభకారిగా మార్చే ప్రసక్తి రాలేదని అన్నారు. అప్పట్లో ఉత్పత్తి ఖర్చు కన్నా కనీస మద్దతు ధర 50 శాతం ఎక్కువ ఉండాలన్న స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సును అప్పటి అంతర్ మంత్రిత్వ శాఖ సంఘం(ఇంటర్‌మినిస్ట్రీ ప్యానెల్) తిరస్కరించిందని కూడా ఆయన వివరించారు. కాగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాక కనీస మద్దతు ధరపై కమిటీని ఏర్పాటు చేస్తామని తోమర్ చెప్పారు. అయితే కమిటీ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించగలదని కూడా స్పష్టం చేశారు.

తెలుగు దేశం పార్టీ(టిడిపి)కి చెందిన కనకమేడల రవీంద్ర ‘తక్కువ పంట సేకరణ, తక్కువ కనీస మద్దతు ధర కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తోమర్ “రైతుల తమ పంటకు సరైన ధరను పొందాలి. ఆ విషయంలో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది…” అని సమాధానం ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సుఖ్‌రామ్ సింగ్ యాదవ్ అడిగిన మరో అనుబంధ ప్రశ్నకు సమాధానంగా తోమర్ “ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచిందని, పంటలను 12 నుంచి 22కు పెంచిందని, వాటన్నిటిపై ఇస్తున్న కనీస మద్దతు ధర 201314 కన్నా 1.5 రెట్లు ఎక్కువగా ఉంది” అన్నారు. స్వామినాథన్ కమిటీ 2004లో ఏర్పాటయింది. ఆ కమిటీ తన నివేదికను 2006లో సమర్పించింది. 2007లో దానిపై అంతర్గత మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం కమిటీ చేసిన 215 సిఫార్సుల్లో 201 సిఫార్సులను ఆమోదించింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిలో 200 సిఫార్సులను అంగీకరించి, వాటిపై పనిచేస్తోంది” అని తోమర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News