Thursday, January 23, 2025

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని లెక్కలేమిటి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని పౌరులందరికీ ఒకే ఉమ్మడి పౌరస్మృతి అవసరమంటూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ప్రకటన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఒక చట్టం తీసుకు రావడం ద్వారా దీన్ని అమలు చేయడానికి బిజెపి ప్రయత్నించవచ్చనే ఊహాగానానాలకు తెరతీసింది. అయితే పార్లమెంటులో ఈ చట్టం ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యాబలం అధికార పార్టీకి ఉందా అనేదే పెద్ద ప్రశ్న. బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉన్న లోక్‌సభలో ఈ బిల్లు అమోదం పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు .కానీ రాజ్యసభలో మాట ఏమిటి? అయితే బిజెపి బద్ధ శత్రువైన ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా చేసిన ప్రకటన కొత్త ఆలోచనలకు తెరదీసింది. ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్‌ను తాము సూత్రప్రాయంగా సమర్థిస్తున్నామని, అయితే దీనిపై భాగస్వాములందరితోనే చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ బుధవారం పేర్కొంది.

రాజ్యసభలో బలాబలాలు
ఎగువ సభ(రాజ్యసభ)లో ప్రస్తుతం 237 మంది సభ్యులుండగా ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. అంటే మెజారిటీ కావాలంటే 119 మంది సభ్యులు అవసరం. బిజెపికి 92 మంది ఎంపీలుండగా దాని మిత్రపక్షమైన అన్నాడిఎంకెకు నలుగురు సభ్యులున్నారు. బిజెపిని మద్దతు ఇచ్చే ఎనిమిది పార్టీలకు తలా ఒక సభ్యుడు ఉన్నారు. అంటే అధికార కూటమికి మొత్త 103 సభ్యుల బలం ఉంది. దీనికి ఒక స్వతంత్ర అభ్యర్థి, అయిదుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కలిపినప్పటికీ బిజెపి బలం మెజారిటీకి పది మంది తక్కువ ఉంటారు. ఒక వేళ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌కు చెందిన 9 మంది ఎంపిలు మద్దతు ఇచ్చినప్పటికీ బిజెపి మెజారిటీ మార్కుకు అడుగు దూరంలోనే ఉంటుంది. అనేక సందర్భాల్లో అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌరస్మృతికిమద్దతు ఇవ్వబోమని ఇప్పటికే ప్రకటించింది.

కీలకం కానున్న ఆప్
రాజ్యసభలో ఆప్‌కు 10 మంది ఎంపీలున్నారు. వీరిలో ఢిల్లీకి చెందిన వారు ముగ్గురు కాగా పంజాబ్‌కు చెందిన వారు ఏడుగురున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకోసం ప్రతిపక్షాలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టి ఒక్క తాటిపైకి రావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌తోఅమీ తుమీకి ఆప్ సిద్ధవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఉమ్మడి పౌరస్మృతికి సూత్రప్రాయంగా మద్దతు తెలియజేస్తూ ఆప్ చేసిన ప్రకటన ఆప్ మద్దతు ఇస్తే ఉమ్మడిపౌరస్మృతి బిల్లు సునాయాసంగా ఆమోదం పొందుతుందనే ఊహాగానాలకు కారణమవుతోంది. అయితే ఢిల్లీలో అధికారులపై పెత్తనానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ విషయంలో బిజెపి, ఆప్‌లు బద్ధ శత్రువుల్లాగా తలపడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆప్‌కు మద్దతు తెలపలేదు. అందుకే కాంగ్రెస్ ఉండే ఏ కూటమిలోనైనా తాము చేరడం చాలా కష్టమని ఆప్ అంటోంది.

మద్దతు ఇస్తుందా? అనేదే ప్రధానప్రశ్న.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ పది స్థానాల్లో బెంగాల్‌లో ఆరు. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఉన్నాయి. బెంగాల్‌లోని ఆరు స్థానాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌కు అయిదు, కాంగ్రెస్‌కు ఒక స్థానం ఉన్నాయి. అయితే తొలిసారి బిజెపి బెంగాల్‌నుంచి ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. గుజరాత్‌లో పదవీ విరమణ చేయనున్న ముగ్గురు కూడా బిజెపికి చెందిన వారే. ఖాళీ కానున్న గోవా సీటు కూడా ఆ పార్టీకి చెందినదే. ఇక ఖాళీగా ఉన్న ఎనిమిది స్థానాల్లో నామినేటెడ్ సభ్యులకు చెందినవి రెండు, జమ్మూ, కశ్మీర్‌కు చెందినవి నాలుగు ఉన్నాయి. బిజెపికి చెందిన హర్దార్ దూబే మరణంతో ఒక స్థానం ఖాళీ కాగా, గతంలో తృణమూల్ కు ప్రాతినిధ్యం వహించిన లూయిజునో ఫలేరియో రాజీనామాతో మరో స్థానం ఖాళీ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News