దేశంలో గుత్తాధిపత్యం కారణంగా సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తోందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్ వద్ద నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. “ ఎన్నికల సంస్థలతో సహా అన్నింటిలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటోంది. అన్నిచోట్లా తన ఆధిపత్యాన్ని నెలకొల్పుతోంది. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కారణంగా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచం లోని అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలు అందుబాటులో లేవు. 140 కోట్ల మంది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు. త్వరలోనే ఈ దేశ యువత మేల్కొని బ్యాలెట్‌లకు మద్దతుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తారు” అని ఖర్గే పేర్కొన్నారు. భారత్‌పై అమెరికా 26 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖర్గే దీన్ని ప్రస్తావిస్తూ సుంకాలపై పార్లమెంట్‌లో చర్చించాలని తాము పట్టుబట్టినా వారు పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగం కారణంగా విదేశాలకు వెళ్తున్న యువతను బంధించి వెనక్కి పంపించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. ఈ క్రమం లోనే ఆయన మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.