Monday, January 20, 2025

భారత్ ఖాతాలో మూడో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

అజేయుడు అచింత
వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన షెపులి
భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
బర్మింగ్‌హామ్: కామన్‌వెల్త్ గేమ్స్2022లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ పోటీల్లో భారత్ ఇప్పటివరకు 6 పతకాలు సాధించగా.. ఆ ఆరు వెయిట్ లిప్టింగ్‌లోనే రావడం శుభపరిణామం. 73 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. స్నాచ్‌లో 143కేజీలు, క్లీన్ అండ్ జ్‌ర్క్‌ల్రో 170కిలోలు ఎత్తి భళా అనిపించాడు. మొత్తం 313 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసి కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక అతని విజయం ఖాయమైన అనంతరం కోచ్‌లు, సహాయక సిబ్బంది సంబరాల్లో మునిగితేలారు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. 22 స్వర్ణ పతకాలతో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఇంగ్లాండ్-11, మూడో స్థానంలో న్యూజిలాండ్10, నాలుగో స్థానంలో సౌతాఫ్రికా4, ఐదో స్థానంలో కెనడా3 స్వర్ణాలతో భారత్ కంటే ముందున్నాయి.
షెవులి స్వగ్రామం డియోల్పూర్..
పశ్చిమబెంగాల్‌లోని డియోల్పూర్ అచింత షెవులి స్వగ్రామం. హౌరా నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం. అచింత తండ్రి దినసరి కూలీ. తల్లి టైలరింగ్ చేసేది. అతనికి ఓ అన్న అతని పేరు అలోక్. అయితే అచింతకు ఊహ తెలిసేనాటికే తండ్రి చనిపోయాడు. 2014లో అచింత తండ్రి మరణించగా.. అప్పటికీ అతని వయసు 13 ఏళ్లు మాత్రమే. తండ్రి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఆ కుటుంబం దగ్గర చిల్లి గవ్వలేదు. ఇరుగుపొరుగు వాళ్లు ఇచ్చిన సాయంతో ఆ కార్యక్రమం పూర్తి చేశారు. తండ్రి అకాల మరణంతో అన్న కుటుంబ బాధ్యతలను తీసుకున్నాడు. చదువు మానేసి దినసరి కూలి, హమాలీగా జీవనాన్ని కొనసాగించాడు. అతనికి అండగా అచింత కూడా నిలిచాడు. అన్నతో కలిసి హమాలి పని చేయడంతో పాటు అమ్మ టైలరింగ్ పనికి సాంయ చేసేవాడు. ఆమె కోసం కుట్లు అల్లికల పని కూడా నేర్చుకున్నాడు.
ఊళ్లో వడ్ల బస్తాలు మోసిన అచింత..
అచింత అన్నకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. వాస్తవానికి అతడే వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు. కానీ తండ్రి మరణంతో అది సాధ్యం కాలేదు. అన్నా తమ్ముళ్లు కలిసి ఊళ్లో వడ్ల బస్తాలు మోసేందుకు వెళ్లేవారు. ఒక్క బస్తా మోస్తే ఒక రూపాయి ఇచ్చేవారు. కామన్వెల్త్ గేమ్స్‌లో 313 కిలోల బరువెత్తిన అచింత.. చిన్నవయసులోనే క్వింటాళ్లకు క్వింటాళ్ల వడ్ల బస్తాలు మోసాడు. ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుంటే రోజంతా బస్తాలు మోశాక సాయంత్రం చికెన్ కూరతో భోజనం పెట్టేవారు. పని నుంచి సాయంత్రం ఇంటికి రాగానే అమ్మకు కోల్‌కతా నుంచి వచ్చే కుట్లు, అల్లికలు (ఎంబ్రాయిడరీ వరక్స్) పనిలో సాయం చేసేవారు. అంతా చేస్తే వారానికి వారు సంపాదించే ఆదాయం వారానికి రూ. 1,200 మాత్రమే. దాంతో అన్నదమ్ములిద్దరూ ఇదే పని చేయాలని నియమమేమీ పెట్టుకోలేదు. వాళ్ల కడుపు నింపే పనేదైనా సరే.. చేసేశారు.
ఛాంపియన్స్‌లో నాలుగో స్థానం..
2014లో నేషనల్ ఛాంపియన్స్‌లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ యూత్ కేటగిరీలో పాల్గొన్న అచింత.. నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే అతని ప్రతిభను గుర్తించిన కోచ్ అస్టోమ్ దాస్.. అచింతను పూణెలో ఉన్న ఆర్మీ స్పోరట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్‌ఐ)కు తీసుకెళ్లాడు. అక్కడ అచింత జీవితం మరో మలుపు తిరిగింది. రోజుకు మూడు పూటలు తిండితో పాటు సరైన శిక్షణ లభించింది. ఏఎస్‌ఐలో రాటుదేలిన అచింత.. 2018లో ఆసియన్ యూత్ ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ గెలిచాడు. గతేడాది జరిగిన జూనియర్ వరల్ ఛాంపియన్‌షిప్స్ పోటీల్లో రజతం నెగ్గాడు. పతకాల వేట ప్రారంభమయ్యాక అచింత వెనుదిరిగి చూసుకోలేదు.
భారత్‌కు మరో రెండు పతకాలు..
ఇదిలా ఉండగా భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. జూడో 48 కేజీ విభాగంలో భారత అథ్లెట్ సుశీలాదేవి లిక్మాబమ్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్‌లో మారిషస్‌కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్‌పై సుశీలా గెలపొంది పతకాన్ని ఖాయం చేసుకోగా మరో వైపు లాన్‌బౌల్స్ క్రీడలో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల ఫోర్స్ లాన్‌బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో ఓడించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మకమైన పోటీల్లో మరో పతకం ఖాయమైంది. కాగా, లాన్‌బౌల్స్ క్రీడలో భారత్‌కు ఇది తొలి పతకం.
పతకాల పట్టిక
1. మీరాబాయ్ చానుగోల్డ్
2. జెరెమీ లాల్రినుంగాగోల్డ్
3.అచింత షెవులిగోల్డ్
4. సంకేత్ మహదేవ్‌సిల్వర్
5. బింద్యారాణి దేవీసిల్వర్
6. గురురాజ్ పూజారిబ్రాంజ్

Commonwealth Games: Achinta Sheuli won Gold Medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News