Saturday, December 21, 2024

చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

సింధు, లక్షసేన్, శరత్‌లకు స్వర్ణాలు
డబుల్స్‌లో సాత్విక్‌చిరాగ్ జోడీకి గోల్డ్, హాకీలో రజతం
చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 6-1 పతకాలను సొంతం చేసుకుని సత్తా చాటింది. సోమవారం పోటీల చివరి రోజు భారత్ ఏకంగా నాలుగు స్వర్ణాలు గెలిచి పెను సంచలనం సృష్టించింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్లు పి.వి.సింధు, లక్షసేన్‌లు పసిడి పతకాలను ముద్దాడారు. అంతేగాక పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డిచిరాగ్ శెట్టి జంట పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక పురుషుల టిటి సింగిల్స్ విభాగంలో అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత ఆటగాడు జ్ఞానశేఖరన్ సాతియాన్ కాంస్య పతకాన్ని సాధించాడు. అయితే పురుషుల హాకీలో భారత్‌కు రజతమే దక్కింది. భారీ ఆశలతో ఫైనల్లో బరిలోకి దిగిన భారత్ పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ 0-8 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో భారత్ రజతంతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది.
స్వర్ణ సింధూరం..
మహిళల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పి.వి.సింధు సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో సింధు 21-15, 21-13 తేడాతో కెనడా షట్లర్ మిచెలీ లీని ఓడించింది. ఆరంభం నుంచే సింధు దూకుడును కనబరిచింది. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అసాధారణ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అద్భుత షాట్లతో లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో మరింత దూకుడుగా ఆడింది. ఈసారి కూడా ప్రత్యర్థి మిచెలీ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. చివరి వరకు జోరును కొనసాగించిన సింధు అలవోకగా మ్యాచ్‌ను గెలిచి తన ఖాతాలో తొలి కామన్వెల్త్ స్వర్ణాన్ని జమ చేసుకుంది. కిందటిసారి సింధు రజతం సాధించిన విషయం తెలిసిందే.
మెరిసిన లక్షసేన్
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లోనూ భారత్ పసిడి పతకం సాధించింది. సోమవారం చివరి రోజు భారత స్టార్ షట్లర్ లక్షసేన్ మలేసియా ఆటగాడు ఎన్‌జి జి యోంగ్‌ను ఓడించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు లక్షసేన్ 19-21, 21-9, 21-16 తేడాతో యోంగ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు సేన్ అటు యోంగ్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. అయితే చివరికి సెట్ మాత్రం యోంగ్‌కే దక్కింది. కానీ రెండో గేమ్‌లో సేన్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే సమయంలో అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. చివరి సెట్‌లో కూడా లక్షసేన్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన లక్షసేన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో లక్షసేన్ భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రకాశ్ పదుకొణె, సయ్యద్ మోడీ, పారుపల్లి కశ్యప్‌ల సరసన నిలిచారు. గతంలో వీరు కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణాలు సాధించారు. తాజాగా లక్షసేన్ కూడా ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.
డబుల్స్‌లోనూ పసిడి..
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో కూడా భారత్ పసిడి పతకం గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి విజయం సాధించింది. ఇంగ్లండ్‌కు చెందిన బెన్‌లేన్‌సీన్ వెండీ జోడీతో జరిగిన పోరులో భారత జంట 21-15, 21-13 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జంట వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుంది. సాత్విక్ జోడీ జోరుకు ప్రత్యర్థి జంట పూర్తిగా చేతులెత్తేసింది. ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే రెండు సెట్లను కోల్పోయింది. ఇక చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన భారత జంట స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
టిటిలో శరత్‌కు పసిడి..
పురుషుల టెబుల్ టెన్నిస్ (టిటి)లో భారత అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ స్వర్ణం సాధించాడు. సోమవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శరత్ 4-1 తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన లియామ పిచ్‌ఫోర్ట్‌పై విజయం సాధించాడు. ఆరంభం నుంచే శరత్ దూకుడుగా ఆడాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. మరోవైపు లియామ్ ఏ దశలోనూ శరత్‌కు పోటీ ఇవ్వలేక పోయాడు. అద్భుత ఆటతో అలరించిన శరత్ అలవోకగా మ్యాచ్‌ను గెలిచి చారిత్రక టిటి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత్‌కు చెందిన మరో ఆటగాడు జ్ఞానశేఖరన్ టిటిలో కాంస్యం సాధించాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో జ్ఞానశేఖరన్ 43 తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన పాల్ క్రింగ్‌హాల్‌ను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో జ్ఞానశేఖరన్ 11-9, 11-3, 11-5, 9-11, 10-12, 11-9 తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకున్నాడు.
హాకీలో రజతంతో సరి..
పురుషుల హాకీలో భారత్‌కు రజతం మాత్రమే దక్కింది. స్వర్ణం సాధిస్తుందని భావించిన భారత్ ఫైనల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన స్వర్ణ పోరులో భారత్ ఘోర పరాజయం పాలైంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా 8-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వరుస గోల్స్‌తో భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ అలవోక విజయాన్ని అందుకుంది. ఇక మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం దక్కిన విషయం తెలిసిందే.

Commonwealth Games: Sindhu won Silver Medal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News