మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్‌తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ ఐక్యతకు భంగం
సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం
మంటగల్పుతోంది పంజాబ్‌లో ప్రధానికి
రైతుల సెగ తగలడం వల్లే వెనక్కి వచ్చారు
పరువు కాపాడుకునేందుకు భద్రతా
లోపమని నాటకం యుపి ఎన్నికల్లో
అఖిలేశ్‌దే విజయం : ప్రగతిభవన్‌లో
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జాతీయ
రాజకీయాలపై సుదీర్ఘ చర్చ వేర్వేరుగా
ముఖ్యమంత్రిని కలిసిన సిపిఐ, సిపిఎం
జాతీయ, రాష్ట్ర నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు అత్యంత అవసరమని ఉభయ కమ్యునిస్టు పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. మోడీ నేతృత్వంలోని పాలనలో సామాన్య ప్రజలకు రోజురోజుకు బతుకు భారంగా మారుతోందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వద్ద వారు వాపోయారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. ఇటువంటి ప్రభుత్వం మరికొంత కాలం అధికారంలో ఉంటే దేశం పూర్తిగా అధోగతి పాలు అవుతుందని కెసిఆర్‌తో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీలాం టి (కెసిఆర్) నేతలు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా, రైతు కూలీలకు వ్యతిరేకంగా దుర్మార్గపు పాలన సాగిస్తున్న బిజెపిని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భావసారూప్యత కలిగిన ప్రగతిశీల పార్టీలు, శక్తులన్నీ ఒకే వేదిక మీదకు రావాల్సిన అత్యవసర పరిస్థితులున్నాయని ఉభయ కమ్యునిస్టు పార్టీల జాతీయ అగ్రనేతలు సిఎం కెసిఆర్‌కు వివరించినట్లుగా సమాచారం.
దీనిపై మరోసారి సమగ్రంగా చర్చించేందుకు త్వరలోనే సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. నగరంలో జరుగుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ నేతలు హైదరాబాద్‌కు రాగా, సిపిఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ నాయకులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతి భవన్‌కు విడివిడిగా వచ్చారు.ఈ సందర్భంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై కమ్యునిస్టు నేతలు కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించారని తెలుస్తోంది. కేంద్రంలోని బిజెపి దుర్మార్గ పాలన నుంచిదేశానికి విముక్తి లభించేలా ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాలన్నారు. బిజెపి విభజన రాజకీయాలు దేశ ఐక్యతకే భంగం కలిగించే ప్రమాదం ఉందని, భారతీయ గంగా జమునా తహజీబ్ ను కాపాడేందుకు “ బిజెపి ముక్త్ భారత్ ” కోసం ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృది కి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యతతో సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుపడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఇటువంటి వైఖరి శోచనీయమని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పంజాబ్ పర్యటనకని బయలు దేరిన ప్రధాని మోడీకి రైతు వ్యతిరేక సెగ తగలడం ఆయన వెనక్కు తిరిగి రావడం ఆ తరువాత అది భధ్రతాకారణాల లోపంగా మారడం …సంబంధిత అంశాల పై వామపక్షాలు తమ అభిప్రాయాలను సూటిగా వెల్లడించినట్టు సమాచారం. పంజాబ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడ బిజెపి కి రైతులు ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారన్నారు. అందుకే ప్రధాని సభకు జనం రాక వెల వెల పోయిందన్నారు. ఈ విషయం ప్రధాని మోడీకి స్పష్టంగా అర్థమయిందన్నారు. అందుకే పరువు కాపాడుకునేందుకు భద్రతాకారణాల నాటకం బిజెపి ఆడుతున్నదని వామపక్ష పార్టీల అగ్రనేతలు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఉత్తర ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన సందర్భంగా జాతీయ రాజకీయాల పై వారు సిఎం కెసిఆర్ తో చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి ఓటమి ఖాయం అని, బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వారు విశ్లేషించినట్టు సమాచారం. రాబోయే యుపి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గెలుపు ఖాయమని, బిజెపిని ఉత్తర ప్రదేశ్ ప్రజలు తిరస్కరించనున్నారని ఉభయ కమ్యునిస్టు పార్టీల నేతలు అభిప్రాయ పడ్డట్టు సమాచారం. కాగా సిఎం కెసిఆర్‌ను కలిసిన వారిలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ, అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ పార్లమెంటరీ పార్టీ పక్షనేత, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవిన్యూశాఖ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.
వారితో పాటు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదిరులు కూడా హాజరయ్యారు.