Monday, November 25, 2024

ఈ నెల 8 నుంచి 11వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ

- Advertisement -
- Advertisement -

Communist Party of China Plenary from nov 8th

మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు వీలు కల్పించే కీలక సమావేశం
చరిత్రాత్మక తీర్మానముంటుందని అధికార మీడియా వెల్లడి

బీజింగ్: ఈ నెల 8 నుంచి 11 వరకు జరిగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సిపిసి) సర్వసభ్య సమావేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను మూడోసారి ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. సిపిసి ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చైనా అధికార పత్రిక జిన్‌హువా వ్యాఖ్యానించింది. చైనాలోని మూడు కీలక పదవులను జిన్‌పింగ్ నిర్వహిస్తుండటం గమనార్హం. సిపిసి ప్రధాన కార్యదర్శి పదవితోపాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్(సిఎంసి)గానూ, దేశ అధ్యక్షుడిగానూ జిన్‌పింగ్ వ్యవహరిస్తున్నారు. దేశాధ్యక్షుడిగా ఒకే వ్యక్తి రెండు పర్యాయాలకుమించి ఉండకూడదన్న నిబంధన ఉండేది. సిపిసి వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన డెంగ్‌జియావోపింగ్ ఈ నిబంధనను తీసుకొచ్చారు. జిన్‌పింగ్ కోసం ముందస్తుగానే ఈ నిబంధనను తొలగిస్తూ 2018 ప్లీనరీలోనే సిపిసి నిర్ణయం తీసుకున్నది. అంతేగాక సిపిసి కీలక నేతగా జిన్‌పింగ్‌ను 2016లో ప్రకటించింది. మావో తర్వాత అలాంటి హోదా ఎవరికీ ఇవ్వకపోవడం గమనార్హం.

సిపిసిలో మొత్తం 370 మంది సభ్యులుండగా, 25మంది అత్యున్నత రాజకీయ విభాగం పొలిట్‌బ్యూరోలో సభ్యులు. వారిలో కనీసం 12మంది 68 ఏళ్లు పైబడినవారే. జిన్‌పింగ్‌కు ఇప్పటికే 68 ఏళ్లు. పాత నిబంధన ప్రకారం 68 ఏళ్లు పైబడినవారు నాయకత్వం నుంచి తప్పుకోవాల్సి ఉండగా, దానిని 2018లో తొలగించారు. ఈసారి జరిగే ప్లీనరీలో చరిత్రాత్మక నిర్ణయముంటుందని అధికార మీడియా తెలిపింది. సిపిసి చరిత్రలో అలాంటి నిర్ణయాలు ఇప్పటి వరకు రెండు సందర్భాల్లోనే జరిగాయి. 1945లో ఓసారి, 1981లో మరోసారి చరిత్రాత్మక నిర్ణయాలను సిపిసి ప్లీనరీలో తీసుకున్నారు. 1945లో అంతర్జాతీయంగా స్టాలిన్ ప్రభావం నుంచి బయటపడి, మావో ఆలోచనలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 1981లో డెంగ్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం రెండోది. మావో హయాంలో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం చెడు ఫలితాలనిచ్చిందని డెంగ్ నాయకత్వంలో సిపిసి నిర్ణయించింది. ఇప్పుడు జిన్‌పింగ్ నేతృత్వంలో తీసుకునే చరిత్రాత్మక నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. 2022లో జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News