ప్రజాస్వామ్యం అమెరికా పేటెంటా?
బలీయనేత జిన్‌పింగ్ కోర్‌లీడర్
సిపిసి నిర్ణయం సముచితం
ప్రపంచస్థాయి విమర్శలకు జవాబు
బీజింగ్ : చైనాలో జి జిన్‌పింగ్‌కు తిరుగులేని అధికార కేంద్రీకృత హోదా కట్టబెట్టడాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) గట్టిగా సమర్థించుకుంది. తమ నేత సమర్థతను చైనా బలోపేతానికి పాటుపడ్డ తిరుగులేని ఆయన శక్తిని గ్రహించే ఆయనకు పార్టీ ఈ విధమైన ప్రాధాన్యతను ఇచ్చింది. సంపూర్ణ కేంద్రీకృత అధికారాన్ని కట్టబెట్టింది. దీనిపై అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు గుర్రు ఎందుకో అర్ధం కావడం లేదని సిపిసి శుక్రవారం పేర్కొంది. తమ దేశ పరిణామాల విషయంలో ప్రజాస్వామ్య హననం అయిందనే ధోరణిలో అమెరికా ఇతరదేశాలు వ్యాఖ్యానించడాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంపై అమెరికా, వెస్ట్ ఏమైనా పూర్తి స్థాయి పెటేంట్ హక్కులు తీసుకున్నాయా? వారు చెప్పేదే ప్రజాస్వామ్యమా? ఇతరుల విధానాలు నియంతృత్వమా ? అని సిపిసి నిలదీసింది. జిన్‌పింగ్‌ను జీవితకాల పార్టీ, పాలక సైనిక నేతగా ఎంచుకునేందుకు వీలు కల్పించిన సిపిసి చారిత్రక రాజకీయ తీర్మానాన్ని సమర్థిస్తూ సిపిసిలోని పాలసీ రిసర్చ్ విభాగం డైరెక్టర్ జియాన్ జింక్వాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సిపిసి ప్లీనరీ నాలుగురోజుల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చైనా కోర్ లీడర్‌గా జిన్‌పింగ్‌కు సర్వసత్తాక అధికారాలు కట్టబెడుతూ ఇందులో తీర్మానం వెలువరించారు. తమ నేత ఆధ్వర్యంలో అధికార పార్టీకి భరోసా ఉంటుంది. దేశానికి పార్టీ వెన్నెముక అవుతుంది. ఈ క్రమంలోనే ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించినట్లు, దీనిని అందలం ఎక్కించినట్లుగా భావించడం కుదరదని అన్నారు. 140 కోట్ల జనాభా, దాదాపు పదికోట్ల మంది సభ్యుల బలం ఉన్న తమ పార్టీకి సరైన నిర్ధేశనం అందిస్తూ, దేశాన్ని దూసుకువెళ్లేలా చేస్తున్న నేతను కోర్ లీడర్‌గాఎంచుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. పార్టీ సెంట్రల్ కమిటికీ ఆయువుపట్టు వంటి వ్యక్తి నేతగా ఉంటే పార్టీ యావత్తూ బలంగా వేళ్లూనుకుంటుందని తెలిపారు. పార్టీకి కేంద్రీకృత బిందువు అంటూ లేకపోతే అనూహ్య పరిణామాలు తలెత్తుతాయని ఈ పాలసీ నిర్ణేత తెలిపారు. పార్టీకి కేంద్రీకృత నేత లేకపోతే పార్టీలో సమన్వయం లోపిస్తుంది. అనుకున్నది ఏదీ సాధించడం కష్టం ఉందన్నారు.
పార్టీ సెంట్రల్ కమిటీకి కీలకమైన వ్యక్తి కేంద్రీకృత బిందువు ఉండటం వల్ల పార్టీ అంతా మరింత బలోపేతం అయితీరుతుందనే అంశాన్ని తామంతా గ్రహించి ఇందుకు అనుగుణంగానే కోర్ నేతగా ప్రకటించడం జరిగిందన్నారు. మొత్తం మీద చెప్పాలంటే ఆయన పూర్తి సమర్థత, నాయకత్వ లక్షణాలను అవగతం చేసుకున్న తరువాతనే ఈ హోదా ఇచ్చినట్లు తెలిపారు. ఆయనే పార్టీకి, ప్రజలకు , సైన్యానికి కేంద్రీకృత బిందువు. ఈ విధంగా తిరుగులేని అధికారాన్ని ఇవ్వడం తిరుగులేని నిర్ణయం అని తేల్చిచెప్పారు.