Monday, December 23, 2024

శ్రామిక వర్గ పార్టీలు అగ్రవర్ణ సారథులు

- Advertisement -
- Advertisement -

అన్ని పార్టీల్లాగే మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ మధ్య బలహీనపడ్డాయి. లీడర్లు తప్ప కేడర్లు, జనం లేని పార్టీలుగా, ఓట్లు తెచ్చుకోలేని పార్టీలుగా పేరు తెచ్చుకున్నాయి. టిడిపిని గెలిపించి తాము తోక పార్టీలని పేరు పోయామని బాధ పడుతున్నారు. కార్మికుల పేరు చెప్పుకునే ఈ కమ్యూనిస్టు పార్టీల్లో నాయకత్వం కార్మికులు కాదు. వారు చెలాయించేది కార్మికుల నియంతృత్వమూ కాదు.

కార్మికుల పేరు చెప్పి అధికారం చెలాయించేది, పాలసీలు నిర్ణయించేది అగ్రకులాలు, పెటీ బూర్జువాలు, పురుషాధిపత్యవాదులు, ధనిక రైతులు, మధ్య తరగతి, బూర్జువాలు. వీరు కార్మికులను కార్మికులుగానే ఉంచుతారు. వారు ఏ పోరాటాలు చేసినా కార్మికులను యజమానులుగా మార్చిన చరిత్ర లేదు. యజమానులుగా ఎదగాలని నైపుణ్యాల శిక్షణ ఇచ్చింది లేదు. కార్మికులను కార్మికులుగానే ఉంచారు.. కమ్యూనిస్టు పార్టీ పేరిట నాయకులే యజమానులవుతారు తప్ప కార్మికులు కారు. అధికారంలోకి వచ్చాక అందరూ నియంతలే. కొందరు ప్రజలను మెప్పించే నియంతలు. పేరుకు ప్రజాస్వామ్యం. నియంతృత్వం కావాలని చెప్తూ ప్రజాస్వామ్యం ఆచరించే కమ్యూనిస్టులను చూస్తే జనానికి భయం.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ నియంతృత్వాన్ని ఆచరించే వాళ్లను జనం నమ్ముతున్నారు. ఓట్లేస్తున్నారు. అందువల్ల కమ్యూనిస్టులు తమ భాష మార్చుకోవాలి. భయపెట్టే ‘పుస్తకాల భాష’ వదిలేసి ప్రజల హృదయాలను గెలుచుకునే భాష నేర్చుకోవాలి. కార్మివర్గ నియంతృత్వం , ఏకపార్టీ వ్యవస్థ అనే రెండు వదిలేసి ప్రజలను కొత్త భాషతో చైతన్య పరిచి ఓట్లు గెలుచుకోవడం అవసరం. అధికారంలోకి వచ్చాక ఎలాగూ అందరూ నియంతలే.. ప్రత్యేకంగా చెప్పి భయం పెట్టి ప్రజలకు దూరం కావడం దేనికి? కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీల వలెనే తమ నిర్మాణాలను బహు నాయకత్వంలోకి మార్చుకోవాలి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మొదలైన నిర్మాణం చేపట్టాలి.

జనాభా ప్రాతిపదికన పార్టీలో కేంద్ర కమిటీ నుండి కింది దాక జనాభా ప్రాతిపదికన 50 శాతం మహిళలతో పాటు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు 70 శాతం ఉండాలి. ఎన్నికలలో ఇదే ప్రాతినిధ్యంతో టికట్లు ఇవ్వాలి. లోహియా అలా చేసి చూపి విజయం సాధించి మార్గ దర్శకులయ్యారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారే నాయకత్వంలో ఉండాలి. దొడ్డి దారిన రాజ్యసభ, ఎంఎల్‌సి అయ్యే వారు పార్టీ నాయకత్వం చేపట్టకుండా చూసుకోవాలి. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు మద్దతు ఇవ్వాలి. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాల్సి వస్తే బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు, మహిళలకు మాత్రమే మద్దతు ఇచ్చి తాము ప్రజల పక్షం, మహిళల పక్షం అని నిరూపించుకోవాలి. సైద్ధాంతికంగా తాము శతాబ్దాలుగా శ్రామిక వర్గాలుగా మహిళలు, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలే సమస్త సంపద సృష్టి కర్తలని, వారి పక్షాన, కార్మికుల పక్షాన ఉంటామని అవగాహనను మార్చు కోవాలి. అపుడు కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు గెలువవో ప్రజలు చూసుకుంటారు. అగ్రకుల పార్టీలతో జతకట్టి అగ్రకులాల వారిని గెలిపిస్తే ప్రజలకు అన్నీఅర్థమవుతూనే ఉన్నాయి. ఇప్పటిలాగే ఉంటే ఇప్పటిలాగే ఇలాగే ఉండిపోతారు అని గమనించాలని విజ్ఞప్తి.

బి.ఎస్.రాములు
8331966987

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News