అక్టోబర్ 1న మళ్లీ ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం
పోటీ చేయబోయే స్థానాలపై చర్చ!
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దాఖలాలు లేకపోవడంతో ఇక కమ్యూనిస్టులూ ఒంటరిగా బరిలోకి దిగనున్నారు. బిఆర్‌ఎస్‌తో పొత్తు ఖాయం అని కనీసం రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు అయినా కేటాయిస్తారని ఆశపడి భంగపాటుకు లోనయ్యారు. అనంతర కాలంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూడటం, ఆ పార్టీతో చర్చలు కొనసాగించినా అక్కడ కూడా సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇక ఒంటరిగా బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయింకున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని అంటున్నారు.
అక్టోబర్ 1న మరోసారి తాము కలిసి పోటీ చేయబోయే స్థానాలపై చర్చిస్తామన్నారు. బిఆర్‌ఎస్ ఆలోచన బిజెపికి సహకరించేలా ఉందని, బిజెపి కోసమే ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులతో పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. పొత్తుకు అభ్యంతరం లేదని చెప్పిన నేతల్లో ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పినా, మరో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వ్యతిరేకించారని అంటున్నారు. పొత్తు వల్ల గెలిచే సీట్లు వదులుకోవాల్సి వస్తుందని, పైగా ఓట్ల మార్పిడి జరగదని వాదిస్తున్నారు. నల్గొండ, భువనగిరి ఎంపి సెగ్మెంట్ల పరిధిలోని 9 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంక్ ఉందని, పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనమేనని మరికొందరు వాదిస్తున్నారు. కానీ పొత్తు వల్ల కాంగ్రెస్ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం దాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, కమ్యూనిస్టు నేతలు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతోనూ సమావేశమైనా ఎలాంటి ఫలితమూ రాలేదని తెలిసింది. పైపెచ్చు..కమ్యూనిస్టులకు బలంగా ఉన్న జిల్లాలు ఖమ్మం , నల్లగొండ. ఇటీవల చేరికలతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అయింది. బలమైన నేతలు వచ్చి చేరారు. దీంతో అక్కడ ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేదు. నల్లగొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వ ఉంది. ఆ జిల్లాలోనూ సీట్లు కేటాయించలేరు. ఈ కారణంగానే పొత్తులపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.