Friday, November 22, 2024

బిజెపి హఠావో, దేశ్ బచావో!

- Advertisement -
- Advertisement -
కమ్యూనిస్టుల చైతన్య కార్యక్రమం

హైదరాబాద్: ‘బిజెపి హఠావో, దేశ్ బచావో’ అనే దేశవ్యాప్త చైతన్య కార్యక్రమాన్ని సిపిఐ, సిపిఐ(ఎం) నాయకులు నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు ప్రసంగిస్తూ మహిళలు, దళితులు, ముస్లింలను బిజెపి పాలన అణచివేస్తోందన్నారు. ప్రజలంతా ఏకమై బిజెపిని ఓడించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. లౌకికవాద పార్టీలన్నీ తిరిగి అధికారంలోకి వచ్చేలా చేయాలన్నారు. ప్రజలంతా ఎలాంటి ఆశలు, ప్రలోభాలకు తలొగ్గక నిజాయితీపరులైన అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు.

సిపిఐ, సిపిఐ(ఎం) నాయకులు నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద అంజలి ఘటించి ఈ కార్యక్రమాని ఆరంభించారు. ట్యాంక్‌బండ్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీని కూడా నిర్వహించారు. ర్యాలీ ఇందిరాపార్క్ చేరుకున్నాక పబ్లిక్ మీటింగ్‌గా మారింది.

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేసి, అదానీ వంటి కార్పొరేటర్లకు సబ్సిడీలు ఇస్తోందన్నారు. పేదల నుంచే పన్నులు వసూలు చేస్తోందన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న బిజెపికి వ్యతిరేకంగా దేశం యావత్తు ఏకం కావాలన్నారు.

సిపిఐ జాతీయ కమిటీ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో మైనారిటీలపై దౌర్జన్యాలు జరగడంలేదని అమెరికాలో అన్నారని తెలిపారు. కానీ ఇండియాలో మహిళలు, దళితులు, మైనారిటీలు ఎలా అణచివేయబడుతున్నారో ప్రపంచం గమనిస్తోందన్నారు. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలోని ఎక్కడ ఏది జరిగినా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిపోతోందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ పాలసీలను అనుసరిస్తోందని ఆయన ఈ సందర్భంగా ఎలుగెత్తి చెప్పారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడు సి.వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాంబశివ రావు, సిపిఐ నాయకుడు సీతారాములు కూడా ప్రసంగించారు. సిపిఐ ర్యాలీ, పబ్లిక్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News