Monday, December 23, 2024

మహిళా సాధికారత సాధిస్తేనే సమాజాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

Community development only if women empowerment is achieved

మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధితో పాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లింగ సమానత్వం ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై సికిందరాబాద్‌లోని ఓ హోటల్‌లో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా సాధికారత సాధించినపుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని చైర్‌పర్సన్ అన్నారు. ఆడపిల్ల చదువు ఇంటికి , సమాజానికి వెలుగు అని వ్యాఖ్యానించారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టిందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పించారని, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశీ చదువులకు 20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తోందని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడ పిల్లల వివాహాలకు ఆర్థిక మనోబంల కల్పించారని, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్నింటిలో ఎదగాలని మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విదాలుగా సహాయం అందిస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. దేశంలోనే ప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే గాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందన్నారు. ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళల రక్షణ, హక్కులపై కమిషన్ అవగాహన కల్పిస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో షి క్యాబ్స్ పథకం ద్వారా మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. మహిళా హెల్ప్‌లైన్ 198 లేదా, పోస్టల్, ట్విట్టర్, ఇ మెయిల్ ద్వారా, కమిషన్ నెంబర్ 9490555533 కు మహిళా సమస్యలు తెలుపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News