సెబీ అనుమతితో సిద్ధమవుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదటి భాగంలో కంపెనీల ఐపిఒలు(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రైమరీ మార్కెట్‌లోకి కొన్ని రంగాల నుండి కొత్త ఆఫర్‌లు క్యూలో ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో కనీసం 7 ఐపిఒలు రాబోతున్నాయని సమాచారం. ఈ ఐపిఒలలో ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, లా ట్రావెనస్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎక్సిగో), యూనిపారట్స్ ఇండియా లిమిటెడ్, గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ (మెదాంత హాస్పిటల్), నవీ టెక్నాలజీస్ లిమిటెడ్, సిగ్నేచర్ గ్లోబల్, సాంకో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటివి ఉన్నాయి. ఇవి మార్కెట్ నుండి రూ.10,215 కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఇష్యూ పరిమాణం, తేదీ ప్రస్తుతానికి బహిర్గతమైనప్పటికీ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి లేదా ఇతర కారకాల కారణంగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. పండుగ సీజన్‌లో రానున్న ఐపిఒలను తెలుసుకుందాం.
ఐజిఇఎల్‌ఎస్
ఐనాక్స్ విండ్ అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ నుండి రూ. 740 కోట్లను సమీకరించనుంది. అక్టోబర్ చివరి నాటికి సెబీకి కొత్త ఆఫర్ పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది. ఐనాక్స్ జిఎఫ్‌ఎల్ గ్రూప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఐపిఒని తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే ఎటువంటి కారణం చూపకుండానే రెడ్ హియరింగ్ ప్రాస్పెకట్స్ (డిఆర్‌హెచ్‌పి) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకుంది. ఐపిఒ ద్వారా సమీకరించిన రూ.740 కోట్లను అప్పు చెల్లించేందుకు, సాధారణ కార్పొరేట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
లే ట్రావెన్యూస్ టెక్నాలజీ
లే ట్రావెన్యూస్ టెక్నాలజీ (ఎల్‌ఎక్స్‌ఐజిఒ) డిసెంబర్ 2021 లోనే ఐపిఒని తీసుకురావడానికి సెబీ నుండి అనుమతి పొందింది. అయితే ఇది ఇంకా దాని ఐపిఒ తేదీని ప్రకటించలేదు. దీని ఐపిఒ కొత్త ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలయికగా ఉంటుంది. తాజా ఇష్యూ ద్వారా రూ.750 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.850 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ విధంగా, దాని మొత్తం ఐపిఒ పరిమాణం రూ. 1600 కోట్లుగా ఉంది.
యూనిపార్ట్ ఇండియా
ఇంజినీరింగ్ సిస్టమ్స్, సొల్యూషన్స్ ప్రొవైడర్ యూనిపార్ట్ ఇండియా ఐపిఒ ద్వారా రూ. 1000 కోట్లను సమీకరించడానికి సెబీకి డిఆర్‌హెచ్‌పి దాఖలు చేసింది. ప్రారంభ వాటా విక్రయం పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్, ఇందులో 15,731,942 షేర్లు ప్రమోటర్ గ్రూప్ ఎంటిటిలు, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల ద్వారా విక్రయించనున్నాయి. ఐపిఒ తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది.
మెదాంత హాస్పిటల్
గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ (మెదాంత హాస్పిటల్) కింద మేదాంత బ్రాండ్ హాస్పిటల్స్ రానున్నాయి. స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఐపిఒ ద్వారా రూ.2000 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. పెరిగిన మూలధనంతో కంపెనీ రుణాలను తొలగిస్తుంది. ఇతర కార్పొరేట్ విధులను పూర్తి చేస్తుంది. 4.84 ఈక్విటీ షేర్లు విక్రయించనుంది.
నవీ టెక్నాలజీస్
ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌కు చెందిన ఫిన్‌టెక్ సంస్థ నవీ టెక్నాలజీస్ కూడా ఐపిఒను ప్రారంభించేందుకు సెబీ నుండి అనుమతి పొందింది. నవీ టెక్ ఐపిఒ రూ. 3350 కోట్లు, పూర్తిగా తాజా ఇష్యూగా ఉంటుంది. ఈ ఐపిఒ నుండి సేకరించిన డబ్బు దాని అనుబంధ సంస్థలైన నవీ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌పిఎల్), నవీ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ఎన్‌జిఐఎల్) కోసం ఉపయోగించనుంది. సెబీకి సమర్పించిన ఆఫర్ డాక్యుమెంట్ ప్రకారం, కంపెనీ ఎన్‌ఎఫ్‌పిఎల్‌లో రూ.2,370 కోట్లు, ఎన్‌జిఐఎల్‌లో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. మిగిలిన మూలధనం కంపెనీ సాధారణ కార్పొరేట్ వెంచర్ల కోసం ఉపయోగించనుంది.
సాంకో గోల్డ్ అండ్ డైమండ్స్
సెన్‌కో గోల్ అండ్ డైమండ్స్ ఐపిఒ ద్వారా దలాల్ స్ట్రీట్ నుంచి రూ.525 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. సెబీ వద్ద డిపాజిట్ చేసిన డిఆర్‌హెచ్‌పి ప్రకారం, కంపెనీ 325 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. 200 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది.