హైదరాబాద్ : సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే ఈ సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా సింగరేణి అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించింది. వీటిలో సిఎం కెసిఆర్ ప్రకటించిన కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 15,250 మంది వారసులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ప్రత్యక్ష నియామకం ద్వారానే 4,207 మందికి ఉద్యోగాలు రావడం విశేషం. అలాగే తెలంగాణలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్‌లో అత్యద్భుత వృద్ధిని సాధించింది. తెలంగాణ రాక పూర్వం 2013-14లో 504 లక్షల టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022- -23లో 33 శాతం వృద్ధితో 671 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరింది.
అలాగే తెలంగాణ రాక పూర్వం 2013 – 14లో 479 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిన కంపెనీ తెలంగాణ వచ్చిన తర్వాత 2022- – 23లో 39 శాతం వృద్ధితో 667 లక్షల టన్నుల బొగ్గను రవాణా చేసింది. మొత్తంగా తెలంగాణ రాకపూర్వం సింగరేణి సంస్థ టర్నోవర్ 11,928 కోట్లు ఉండగా గత తొమ్మిది సంవత్సరాల్లో 176 శాతం వృద్ధితో గత ఏడాది 32వేల 978 కోట్లకు పెరిగింది. లాభాల పరంగా చూస్తే.. తెలంగాణ రాకపూర్వం 2014లో 419 కోట్ల రూపాయల లాభాలు గడించిన సింగరేణి గత ఏడాది 421 శాతం వృద్ధితో 2,184 కోట్ల రూపాయల లాభాలను గడిచింది. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, బొగ్గు రవాణాలో 39 శాతం వృద్ధిని సాధించిన సింగరేణి గడచిన తొమ్మిదేళ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకుంది. కాగా ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కార్మికుల కోసం 2 వేల విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెంలో నిర్మించారు.
కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం పది లక్షల గృహ రుణంపై వడ్డీని సింగరేణి సంస్థ చెల్లిస్తోంది. దేశంలో మరే ఇతర బొగ్గు పరిశ్రమలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో 61 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును అమలు జరుపుతున్నారు.