కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : కరోనా మృతులకు పరిహారం అంశం సుప్రీంకోర్టు ముందుకు ప్రస్తావనకు వచ్చింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 4లక్షల పరిహారం ఇవ్వాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చుకోవాలని పేర్కొంది. తమ ముందుకు వచ్చిన పిటిషన్‌పై న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షాతో కూడిన వేసవిసెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. కొవిడ్ 19 మృతులకు డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఐసిఎంఆర్ మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. మరణపత్రాల జారీ విషయంలో సార్వతిక విధానం అవసరం అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విపత్తుల నివారణ, నిర్వహణ చట్టం 2005 పరిధిలో కొవిడ్ మృతుల విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. మృతుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఉంది. ఈ కుటుంబాలకు కనీసం నాలుగు లక్షల పరిహారం అందించాల్సిన అవసరం ఉందని రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కేంద్రం వివరణకు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది.