ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటన
లండన్ : కొవాక్స్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాల వల్ల ఎలాంటి ప్రమాదకర పరిణామాలు తలెత్తినా దానికి పరిహారం చెల్లిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొవాక్స్ ద్వారా 92 దేశాలకు ప్రపంచ ఆరోగ్యసంస్థ టీకాలను సరఫరా చేస్తోంది. ఇది కొవిడ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలుకానున్న ఏకైక నష్టపరిహార కార్యక్రమమని సంస్థ వెల్లడించింది. ఈ బాధ్యత ప్రపంచ ఆరోగ్యసంస్థ తీసుకోవడంతో ఆయా ప్రభుత్వాలకు పెద్ద భారం తొలగినట్టయింది. భారత్‌తోసహా అనేక ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు పరిహారం చెల్లింపు ప్రపంచ ఆరోగ్యసంస్థే చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం ఈ దేశాలకు వెసులుబాటు కల్పించినట్టయింది. టీకాల వల్ల విపరీత పరిణామాలు ఎదురైతే న్యాయస్థానం, ఫిర్యాదులు తదితర ప్రక్రియలతో నిమిత్తం లేకుండా అర్హులైన వారికి నేరుగా పరిహారం చెల్లిస్తారు. ఈ కొవిడ్ పరిహారానికి సంబంధించిన దరఖాస్తులు మార్చి 31 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు 2022 జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది.