కనీస మద్దతు ధర చట్టం
విద్యుత్ బిల్లు ఉపసంహరణపై ప్రకటించే వరకు
రైతు సంఘాల స్పష్టీకరణ
నేడు సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం
అమరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలి, లఖీంపూర్ ఘటన బాధ్యుడు మంత్రి అరుణ్ మిశ్రాపై చర్య తీసుకోవాలి : బిజెపి ఎంపి వరుణ్ గాంధీ
నేడు రైతు సంఘాల సమావేశం
విద్యుత్ సవరణ బిల్లు కూడా రద్దు చేయాల్సిందే
పార్లమెంటులో ప్రకటిస్తే కానీ వెనుదిరిగేది లేదు
ఢిల్లీ సరిహద్దుల్లోనే తిష్ఠవేసి ఉంటాం
పట్టువీడని రైతు సంఘాలు, విపక్షాలు
న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం నిర్ణయించిన తరువాత, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కావాలన్న డిమాండ్‌ను విపక్షాలు తెరముందుకు తెస్తున్నాయి. ఉద్యమ సంఘాలకు అండగా ఉంటున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తదుపరి ఆందోళన కార్యాచరణను నిర్ణయించడానికి ఆదివారం సమావేశమౌతుంది. కనీస మద్దతు ధరతోపాటు, పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ వరకు రోజూ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు ఎస్‌కెఎం కోర్ కమిటీ సభ్యులు దర్శన్‌పాల్ చెప్పారు. పార్లమెంటులో విధానపరంగా ఈ చట్టాలను రద్దు చేసేవరకు ఢిల్లీ సరిహద్ధుల్లో ఆందోళనకారులు తిష్ఠ వేసి ఉంటారని రైతునాయకులు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ , విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీకి తామిచ్చిన పిలుపు ఇంకా ఉందని చెప్పారు. భవిష్యత్ ఆందోళన కార్యక్రమంపైన , కనీస మద్దతు ధరపైన సింఘు సరిహద్దులో ఆదివారం జరగనున్న ఎస్‌కెఎం సమావేశంలో నిర్ణయమౌతుందని తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ కనీస మద్దతు ధర పై రాజ్యాంగబద్ధమైన హామీ కావాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ప్రధానికి లేఖ ద్వారా అభ్యర్థించారు. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ఇదివరకే తీసుకుని ఉంటే అమాయక రైతుల ప్రాణాలు పోకుండా ఉండేవని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో అమరులైన రైతులకు రూ. కోటి వంతున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరుణ్ గాంధీ మాదిరిగా బిఎస్‌పి అధినేత్రి మాయావతి కనీస మద్దతుధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఆందోళన కారులపై ఉన్న కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
ప్రధానికి బిజెపి ఎంపి వరుణ్ గాంధీ లేఖ
నూతన సాగు చట్టాలపై వ్యతిరేకంగా ఆందోళ న చేస్తున్న రైతులకు ఆదినుంచీ మద్దతు తెలుపుతున్న బి జెపి ఎంపి వరుణ్ గాంధీ తాజాగా మరోసారి ఈ అం శంపై స్పందించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను స్వా గతించిన ఆయన కేంద్రం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. కనీస మద్దతు ధరలపై రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. లేదంటే అన్నదాతల ఆందోళన ఆగదని అభిప్రాయపడ్డారు. లఖింపూర్‌ఖేరిలో చోటు చేసుకున్న ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశా రు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఈ ఉద్యమంలో పోరాడుతూ 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఇదే నిర్ణయం గనుక ముందే తీసుకుని ఉంటే ఆ అమాయక ప్రాణాలను పోగొట్టుకునే వాళ్లం కాదనారు.మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు.