Wednesday, January 22, 2025

పంట నష్టపోయిన రైతులకు పరిహారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్ఫష్టం చేశారు. రైతు సోదరుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సిఎం రేవంత్ రెడ్డి పంటల నష్టంపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారని అన్నారు.

పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేశారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడు కూడా పంట నష్టం కింద సాయం చేయలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోలేదని, కనీసం పంట నష్టంపై నివేదికలు కూడా తెప్పించలేదని ఆరోపించారు. రైతు భరోసా పథకం ద్వారా 3.5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఇప్పటికే రూ. 4,295 కోట్లు నగదు బదిలీ చేశామని అన్నారు. 69.86 లక్షల రైతుల్లో 58.66 లక్షల మందికి రైతు భరోసా నగదు బదిలీ చేశామని తెలిపారు. మిగిలిన వారికి వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేశారు. ఓ పక్కన రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటూనే మరోవైపు మూడు నెలల స్వల్ప కాలంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఒకటో తారీకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ధనిక రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అధిక వడ్డీ భారమైన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నామని అన్నారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అన్నట్లు బిఆర్‌ఎస్ నాయకుల తీరు ఉందని మండిపడ్డారు. వారు ఎంత అరిచి గీ పెట్టినా పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గల్లంతు కావడం ఖాయం అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఒక్క సీటైనా గెలవడం గగనమేనని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ మూతపడుతుందని, ఇప్పటికే ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News