Thursday, January 23, 2025

కాంగ్రెస్‌లో టికెట్‌ల కోసం పోటాపోటీగా దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

కోడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి ఒక్కరే దరఖాస్తు
నేటి నుంచి దరఖాస్తులను స్క్రూటీని చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిటీ
ఈ స్క్రూటీని తరువాత సెంట్రల్ కమిటీకి జాబితా
అనంతరం సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితా ప్రకటన
అగ్రవర్ణాలకు మేలు చేయడానికే దరఖాస్తుల డ్రామా !
కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆగ్రహం
ఈసారి కచ్చితంగా 50 శాతం టికెట్‌లు బిసిలకు ఇవ్వాలని నాయకుల డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్:  శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ల కోసం అధిక సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అర్జీలు సమర్పించారు. మొత్తంగా 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహుల్లో పలువురు పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నారు. కొందరు నేతలు రెండు, మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపారు. కొడంగల్ నుంచి పిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు సమర్పించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రిజర్వుడ్ సెగ్మెంట్ల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), శ్రీధర్ బాబు (మంథని), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), పొడెం వీరయ్య (భద్రాచలం) ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల నుంచి అదనంగా దరఖాస్తులు రావడంతో కొంత ఇబ్బంది కలిగించే అంశమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నియోజకవర్గాలతో పాటు రిజర్వుడ్ సెగ్మెంట్లకు సైతం అత్యధిక దరఖాస్తులు వచ్చాయని పిసిసి నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లందు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గానికి 38 మంది దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ దరఖాస్తుల వడపోతను నేటి నుంచి చేపట్టనున్నారు. ఆదివారం నుంచి దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ భేటీలో దరఖాస్తుదారుల అర్హతపై చర్చించనున్నారు. పోటీలో ఉండేదెవరు? పోయేదెవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
ప్రతి నియోజకవర్గం నుంచి మూడు పేర్లు సెంట్రల్ ఎన్నికల కమిటీకి
పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని చేస్తుంది. దరఖాస్తుల పరిశీల తర్వాత అభ్యర్థులైన జాబితాను రూపొందించి స్క్రీనింగ్ మిటీ చైరమన్ మురళీధరన్ కమిటీకి నివేదిస్తారు. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ క్లుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అభ్యర్థి పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేయనున్నారు. ఆ తర్వాత దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజక వర్గాల నుంచి మూడు పేర్లను సెంట్రల్ ఎన్నికల కమిటీకి సిఫారసు చేయనున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి చివరకు సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది.
ఏకాభిప్రాయం కుదరకపోతే చివరి జాబితాలోనే..
అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతేనే ఈ నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి నియోజక వర్గ అభ్యర్థుల జాబితా ప్రకటన చివరి జాబితాలో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగ్రనేతల పర్యవేక్షణలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలు, లొసుగులకు తావుండదని, పాదర్శకతనే ప్రామాణికమని చెబుతున్నారు. టికెట్ల కోసం గ్రూపులు నడిపేవారి మాటలు చెల్లకపోవచ్చని అంచనా వేస్తున్నారు. టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండటం వల్ల సామాజిక న్యాయం పాటించాల్సి ఉండటం కూడా పార్టీకి తలనొప్పిగా మారుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అగ్రవర్ణాలకు అన్ని టికెట్‌లు ఇచ్చే అవకాశం ?
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే సంప్రదాయం తామెప్పుడు చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీని, ప్రజల్లో పలుకుబడితో పాటు ఎవరు గెలుస్తారో గుర్తించి అధిష్టానం గుర్తించి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో బిసిలకు 50 శాతం సీట్లు కచ్చితంగా ఇవ్వాలని, అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచేందుకు వారు సమాయత్తమవుతున్నారు. తమకు అన్నీ అర్హతలు ఉన్నా అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఈసారైనా తమకు న్యాయం చేయాలని బిసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కమిటీలో కూడా బిసిలకు చోటివ్వలేదు
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. కేరళ ఎంపి చైర్మన్‌గా వ్యవహారిస్తున్న ఈ కమిటీలో సభ్యులుగా గుజరాత్‌కు చెందిన జిగ్నేష్, సిద్ధిఖీ, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా రేవంత్, మల్లు, ఠాక్రే, ఉత్తమ్‌లకు చోటు కల్పించారు. కమిటీలో ఒక్క బిసి నేత కూడా లేరని ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీలోనే బిసిలకు చోటివ్వకపోతే ఇక టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News