సైబర్ నేరాలపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి
మనతెలంగాణ, సిటిబ్యూరోః సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. బాధితులు- రూ. 50,000 వరకు పోగొట్టుకుంటే స్థానిక పిఎస్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గతంలో సైబర్ క్రైమ్స్ ఆర్ధిక నేరాల విషయంలో రూ.1,50,000 – కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవారు. అలాగే రూ.1,50,000 కంటే తక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేవారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో సైబరాబాద్ సీపీ సూచనలు చేశారు. ప్రజలు ఏదైనా సైబర్ క్రైమ్స్, ఆన్లైన్లో రూ. 50,000 వరకు పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కేసులను ఇన్ స్పెక్టర్, డిఐ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తారన్నారు. రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కేసులను సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేస్తారన్నారు.